రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారుతో గుద్దిన ఏఎస్సై

రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారుతో గుద్దిన ఏఎస్సై
  •  తీవ్ర గాయాలతో కోమాలోకి బాధితుడు
  •  సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు 

నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా టూ వీలర్​పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఏఎస్సై కారు ఢీకొట్టింది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, బాధితుడి బంధువులు సీసీ కెమెరాల ఆధారంగా ఏఎస్సైని గుర్తించారు. మహంతం గ్రామానికి చెందిన సంగెం రఘుపతి కూలీ పని చేస్తుంటాడు. గురువారం యూనియన్ బ్యాంక్ ఎదుట టూవీలర్​పై రోడ్డు క్రాస్ చేస్తుండగా నిజామాబాద్​ వైపు నుంచి నవీపేట్ వైపు వేగంగా వస్తున్న ఏఎస్ఐ గఫుర్ కారు ఢీకొట్టింది. దీంతో రఘుపతి అక్కడే పడిపోయాడు.

యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని హాస్పిటల్ తరలించాలన్న కనీస స్పృహ లేకుండా ఏఎస్సై అక్కడినుంచి కారుతో సహా ఉడాయించాడు. స్థానికులు బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా వారు వచ్చే సరికి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో రక్తం గడ్డ కట్టి కోమాలోకి వెళ్లాడని డాక్టర్లు చెప్పారు. యూనియన్ ​బ్యాంకు దగ్గర సీసీ కెమెరాలు పరిశీలించగా కారులో ఉన్నది ఏఎస్సైగా తేలింది. వెంటనే పోలీస్​స్టేషన్​కు వెళ్లగా అక్కడ కారుతో పాటు ఏఎస్సై కనిపించాడు. దీంతో బాధితుడి భార్య వసంత ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.