నిర్మల్ జిల్లాలో కొడుకును చంపిన ఏఎస్సై

  • ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
  • తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణం
  • నిర్మల్ జిల్లా ముథోల్​లో దారుణం

ముథోల్, వెలుగు: నిర్మల్ జిల్లా ముథోల్​లో దారుణం జరిగింది. తన కొడుకును ఓ ఏఎస్సై, మరో కానిస్టేబుతల్​తో కలిసి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ముథోల్​కు చెందిన రాందాస్.. కుంటాల పోలీస్ స్టేషన్​లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 32 ఏండ్ల కొడుకు సచిన్ అలియాస్ కరుణ్ ఉన్నాడు. తండ్రీకొడుకుల మధ్య కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బంధువుల దశదిన కర్మ కోసం శనివారం రాందాస్ కుంటాల నుంచి ముథోల్​కు వచ్చాడు. 

నిర్మల్​లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వరుసకు బావ అయిన అనిల్ కూడా ముథోల్​లోనే ఉంటాడు. శనివారం రాత్రి సచిన్​పై రాందాస్, అనిల్ దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు. సచిన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీన్ క్రియేట్​కు ప్రయత్నించారు. ఇది గమనించిన సచిన్ భార్య సుష్మా.. 100కి డయల్ చేసి విషయం చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్ మాట్లాడుతూ.. ముథోల్ పోలీస్ స్టేషన్​కు 100 కాల్ రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్సై రాందాస్, అతని అల్లుడు కానిస్టేబుల్ అనిల్ కలిసి సచిన్​ను చంపేసినట్లు సుష్మా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలాన్ని పరిశీలించారు.