
- ముంగేర్‌లో రెండు గ్రూపుల మధ్య వివాదం పరిష్కరిస్తుండగా దాడి
- ఆరుగురు అరెస్ట్..
- మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు
పాట్నా: బిహార్‌లో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు పోలీస్ అధికారులు హత్యకు గురయ్యారు. బుధవారం అరారియాలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) రాజీవ్ కుమార్ హత్య కలకలం రేపగా.. శుక్రవారం రాత్రి ముంగేర్ జిల్లాలో మరో ఏఎస్ఐ సంతోష్ కుమార్ సింగ్ అదే తరహాలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భాబువాకు చెందిన సంతోష్ కుమార్ సింగ్ ముంగేర్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కొంతకాలంగా స్టేషన్ లోని ఎమర్జెన్సీ డయల్ నంబర్ సర్వీస్ 112లో డ్యూటీ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన పీఎస్ పరిధిలోని నందలాల్‌పూర్ గ్రామంలో ఓ వివాదంపై రెండు గ్రూపులు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నట్లు కాల్ వచ్చింది. దాంతో సంతోష్ కుమార్ తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
రెండు గ్రూపులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. ఓ గ్రూపునకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో సంతోష్ కుమార్ తలపై పదునైన ఆయుధంతో కొట్టాడు. దీంతో ఏఎస్ఐకి తీవ్రగాయాలు కాగా పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి పాట్నాకు తరలించారు. సంతోష్ కుమార్ సింగ్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున పాట్నా ఆసుపత్రిలో చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.