తెలంగాణలో మరిన్ని ప్రాచీన కట్టడాల నిర్వహణను ఏఎస్ఐ స్వీకరించాలి

తెలంగాణలో మరిన్ని ప్రాచీన కట్టడాల నిర్వహణను ఏఎస్ఐ స్వీకరించాలి

పురాతన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, పురాతత్వ సంపదకు పెట్టింది పేరు తెలంగాణ.  కాకతీయులు, చాళుక్యులు, శాతవాహనులు, ఆదిమానవుల చిత్రాలు,  మెన్-హిర్స్,  జైన, బౌద్ధ ఆలయాలు, ఆదిమానవుల బరియల్ గ్రౌండ్స్,  గుహలు,  శిలాజాలు ... ఇలా విభిన్న అంశాలకు చెందిన వందలాది కట్టడాలు తెలంగాణలో ఉన్నాయి.  అయితే,  విచారకరమైన అంశం ఏమిటంటే  తెలంగాణలోని  హెరిటేజ్  కట్టడాలలో  కేవలం 8 మాత్రమే భారతీయ పురాతత్వ శాఖ (ఏ.ఎస్.ఐ) నిర్వహణలో ఉన్నాయి. అదే, ఆంధ్రప్రదేశ్ లోనైతే 129 పురాతత్వ  మాన్యుమెంట్స్  ఏ.ఎస్.ఐ  పరిరక్షణలో ఉన్నాయి.  తెలంగాణలోని  రామప్ప, వేయి స్తంభాల గుడి,  ఫోర్ట్ వరంగల్,  చార్మినార్,  గోల్కొండ,  అలంపూర్,  కొండాపూర్,  ఖమ్మం జిల్లా జనంపాడులోని మెగాలిథిక్ బరియల్స్  మాత్రమే ఏ.ఎస్.ఐ నోటిఫై చేసినవాటిలో ఉన్నాయి.  ఏ.ఎస్.ఐ  నోటిఫై చేస్తే, ఈ మాన్యుమెంట్స్ రక్షణకు 24 x 7 కాపలాదారులను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి పరిరక్షణకు ప్రతి ఏటా కొన్ని నిధులు కేటాయిస్తుంది.  ఏ.ఎస్.ఐ తన జాబితాలో ఈ కట్టడాల వివరాలను తెలుపుతుంది. దీంతో  దేశ, విదేశీ పర్యాటకులు పురాతన కట్టడాలను చూడడానికి రాష్ట్రానికి వస్తారు. తద్వారా  తెలంగాణలో  పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

అద్భుతమైన శిల్ప సంపదఅద్భుతమైన శిల్ప సంపద కలిగిన పురాతన ఆలయాలు, రాక్ పెయింటింగులు, మెగాలిథిక్ బరియల్స్-, మెన్-హిర్స్ మరెక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి.  వీటిలో దాదాపు 63 పురాతన ఆలయాలు  తెలంగాణ  పురాతత్వ, మ్యూజియం శాఖ పరిధిలో ఉన్నాయి. ఇవేకాక, దేశంలో అతితక్కువ ప్రాంతాల్లో ఉన్న వరంగల్  జిల్లాలోని  పాండవులగుట్ట  రాక్-ఆర్ట్ పెయింటింగ్స్, (ఈ పాండవుల గుట్టలు హిమాలయాల కన్నా ప్రాచీనమైనవి) గుండాల మండలం కాచనపల్లి, తాడ్వాయి మండలం బోర్ నర్సాపూర్​లోని మెగా లిథిక్ బరియల్స్, వరంగల్​లోని మెట్లబావి, మహబూబ్ నగర్​లోని గుండు గణపతి,  రంగా రెడ్డి జిల్లా  చేవెళ్ల సమీపంలోని జైన గుహలు... ఇలా దాదాపు 47 పురాతన ఆలయాలు, ప్రముఖ ప్రాంతాలను భారతీయ పురాతత్వ శాఖ  ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద స్వీకరించాలని కోరుతూ, తెలంగాణ పురాతత్వ, మ్యూజియం శాఖ కేంద్ర ప్రభుత్వానికి (ఏ.ఎస్.ఐ )కి 2014 డిసెంబర్​లోనే  ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలు ఏ.ఎస్.ఐ. వద్ద  కోల్డ్ స్టోరేజిలో ఉన్నాయి.  ప్రస్తుత ఏపీలో ఏ.ఎస్.ఐ క్రింద 129 మాన్యుమెంట్స్, తెలంగాణలో  కేవలం 8 మాత్రమే ఉన్నాయి. 

రేవంత్ సర్కారు చొరవ తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ పాలనలో ఉండడం వల్ల మొదటి నుంచి అక్కడి చారిత్రక కట్టడాలు పెద్ద సంఖ్యలో ఏ.ఎస్.ఐ పరిధిలో ఉన్నాయి.  తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉన్నందున 1956లో మాత్రమే ప్రస్తుత 8 మాన్యుమెంట్స్​ను ఏ,ఎస్,ఐ  పరిధిలోకి తెచ్చారు.  అనంతర కాలంలో పెద్దగా ప్రయత్నాలు చేయనందున కొత్త చారిత్రక ప్రదేశాలను ఏ.ఎస్.ఐ పరిధిలోకి రాలేదు.  నిజాం పాలనా కాలంలో అప్పటి పురావస్తు శాఖ ఉన్నతాధికారి గులాం యజ్దాని తెలంగాణలో అనేక పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలోకి అనేక చారిత్రిక ఆలయాలు, పురాతన కట్టడాలను తెచ్చినప్పటికీ  నిధుల లేమితో  కేవలం ఆయా మాన్యుమెంట్స్ వద్ద ఒక బోర్డు పెట్టారు.  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని మరిన్ని చారిత్రక కట్టడాలను భారతీయ పురాతత్వ శాఖ పరిధిలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని చరిత్రకారులు కోరుతున్నారు.
 

- కె. వెంకట రమణ