ప్రపంచ క్రికెట్‍లో తమదే బలమైన జట్టు అంటూ పదే పదే గంభీరాలు పలికే పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఏమైందో అందరికి విదితమే. ఆసియా గెలిచి ప్రపంచ కప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావించిన పాక్ ఆశలకు శ్రీలంక బ్రేక్ వేసింది. పాక్ నిర్ధేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గట్టెక్కింది. ఈ ఓటమిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాతకాలపు ఆలోచనలు మానుకోండి అంటూ ఆ దేశ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు పంపాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సెమీ ఫైనల్ వంటిదన్న ఆఫ్రిది.. తుది జట్టు ఎంపిక స్థాయికి తగ్గట్టు లేదని తెలిపాడు. మంచి ఆటగాళ్లను కూర్చోబెట్టి.. విఫలమైన వారితోనే ఆడించి ఓటమికి కారణమయ్యారని విమర్శలు గుప్పించాడు. ఇకనైనా పాతకాలపు ఆలోచనలు మానుకొని.. భారత్ ను అనుసరించాలని సూచించాడు.
"ఈ ఆసియా కప్‌లో భారత మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొందో ఓసారి పరిశీలించండి. జట్టులోని ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చి.. రిజర్వ్‌బెంచ్‌ను పరీక్షించుకుంది. ప్రాధాన్యత లేని మ్యాచుల్లో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. జూనియర్లతో ఆడించింది. ఇదంతా ప్రపంచకప్ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకొనిచేసిన ప్రయోగాలే. మరి మీరేం చేశారు. వారికంటే ముందే టోర్నీకి 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. అంటే 15 మంది నాణ్యమైన ఆటగాళ్లే కదా! మరి 11 మందికే ఎందుకు ఫిక్సయ్యారు. మంచి ఆటగాళ్లను తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు."
"ఉదాహరణకు షాదాబ్ ఖాన్‌కు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే.. అతడికి స్థానంలో ఆడించేందుకు ఒసామా మిర్ ఉన్నాడు. అతను మంచి ఆటగాడే. మంచి ఆటగాడు కాకపోతే 15 మంది సభ్యుల్లో ఉండేవాడు కాదు కదా!. వరుసగా విఫలమైనపుడు వారికి విశ్రాంతి ఇచ్చి కొత్తవారిని ఆడించాలి. అలా అని జట్టు నుంచి తప్పించమని చెప్పట్లేను. వారికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్తున్నా. కోచ్ లు ఏం చేస్తున్నారు. పాక్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలేంటో నాకైతే అర్థం కావడం లేదు.." అని ఆఫ్రిది ఓ డిబేట్‌లో గరమయ్యాడు.
Shahid Afridi : I was Chief Selector for 1 month and saw huge communication gap between Captain, Coaches and players and their approach..
— ying U (@statpad_R) September 15, 2023
-Jb hr month baad PCB chairman change hoga to yay to hogaa Phir kahtay hn Results Q nahi atay ... #BabarAzam #ShahidAfridi pic.twitter.com/TvR6ulbO4x
కాగా, ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. ఈ టోర్నీ పాక్ జట్టుకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఫైనల్ కూడా చేరకపోగా.. ఆ జట్టు పేసర్లు నసీం షా, హ్యారిస్ రౌఫ్ గాయపడ్డారు. వీరిలో హ్యారిస్ రౌఫ్ వరల్డ్ కప్ 2023 నాటికి కోలుకున్నా.. నసీం షా మాత్రం అనుమానమే.