- మెహిదీ హసన్, శాంటో సెంచరీలు
- రాణించిన టస్కిన్, షోరిఫుల్
లాహోర్: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ బలంగా పుంజుకుంది. మెహిదీ హసన్ మిరాజ్ (119 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 రిటైర్డ్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (105 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 104) సెంచరీతో దంచికొట్టడంతో ఆదివారం జరిగిన గ్రూప్–బి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా 89 రన్స్ భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లు సాధించిన బంగ్లా బలమైన నెట్ రన్‌రేట్‌తో సూపర్–4లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 334/5 స్కోరు చేసింది. తర్వాత అఫ్గాన్ 44.3 ఓవర్లలో 245 రన్స్‌కే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 75), హష్మతుల్లా షాహిది (60 బాల్స్‌లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలు చేశారు. మిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శాంటో రెండో సెంచరీ
తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో కంగుతిన్న బంగ్లా బ్యాటర్లు ఈ పోరులో సమష్టిగా రాణించారు. స్టార్టింగ్‌లో అఫ్గాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో మహ్మద్ నయీమ్ (28), తౌహిద్ హ్రిదోయ్ (0) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. 11 ఓవర్లలోనే ఈ ఇద్దరు పెవిలియన్ చేరడంతో బంగ్లా 63/2తో నిలిచింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న నజ్ముల్ శాంటోకు తోడుగా వచ్చిన మిరాజ్ బ్యాట్ ఝుళిపించాడు. అఫ్గాన్ బౌలింగ్ బలహీనతలను ఎత్తి చూపుతూ భారీ స్కోర్లతో రెచ్చిపోయారు. దీనికితోడు లెఫ్టార్మ్ పేసర్ ఫజల్‌హక్ ఫారూఖీ (0/53)తో పాటు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (0/66) వికెట్లు తీయకుండా ధారాళంగా రన్స్ ఇచ్చుకున్నారు. చాన్స్ వచ్చినప్పుడల్లా బౌండ్రీలు బాదిన హసన్ 115 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. కానీ ఎండ వేడిమి తట్టుకోలేక రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 101 బాల్స్‌లో సెంచరీ బాదిన శాంటో 45వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 215 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. చివర్లో ముష్ఫికర్ రహీమ్ (25), షకీబ్ (32 నాటౌట్), షామీమ్ హుస్సేన్ (11) వేగంగా ఆడారు. ప్రతి బాల్‌ను షాట్‌గా మల్చడంతో చివరి ఐదు ఓవర్లలో 56 రన్స్ రావడంతో బంగ్లా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ముజీబుర్, గుల్బాదిన్ చెరో వికెట్ తీశారు.
బౌలింగ్ అదుర్స్..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో అఫ్గానిస్తాన్‌ను బంగ్లా పేసర్లు టస్కిన్ అహ్మద్ (4/44), షోరిఫుల్ ఇస్లామ్ (3/36) బాగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ (1) ఔటైనా, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా (33) రెండో వికెట్‌కు 78 రన్స్ జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. మధ్యలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లా పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో జద్రాన్‌తో మూడో వికెట్‌కు 52, నజీబుల్లా జద్రాన్ (17)తో నాలుగో వికెట్‌కు 62 రన్స్ జత చేయడంతో అఫ్గాన్ 193/4తో మంచి స్థితిలోనే కనిపించింది. కానీ 38వ ఓవర్‌లో షోరిఫుల్ ఇస్లామ్.. హష్మతుల్లాను ఔట్ చేయడంతో అఫ్గాన్ వికెట్ల పతనం మొదలైంది. మిడిలార్డర్‌లో మహ్మద్ నబీ (3), గుల్బాదిన్ నైబ్ (15), కరీమ్ జనత్ (1), రషీద్ ఖాన్ (24), ముజీబుర్ రెహమాన్ (4) వరుస విరామాల్లో ఔట్ కావడంతో అఫ్గాన్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది.