ఆగని వర్షం.. ఇండియా - పాక్ మ్యాచ్ రేపటికి(సెప్టెంబర్ 11) వాయిదా

ఆగని వర్షం.. ఇండియా - పాక్ మ్యాచ్ రేపటికి(సెప్టెంబర్ 11) వాయిదా

ఆసియా కప్‌ -2023 సూపర్‌-4 దశలో భారత్‌ - పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డుపడ్డాడు. ఆట ప్రారంభమై 24 ఓవర్లు గడిచాక మొదలైన వర్షం.. ఆపై ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డే(సెప్టెంబర్ 11)కు వాయిదా వేశారు. భారత్ ఇన్నింగ్స్‌ నిలిచిపోయిన.. 24.1 ఓవర్ల నుంచి రేపు మ్యాచ్‌ కొనసాగించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఆట ఆరంభం కానుంది. 

వరుణుడు ఎంట్రీ

టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు. భారత ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు ఆట నిలివేయగా.. సిబ్బంది మైదానాన్ని కప్పి ఉంచారు. అనంతరం 2 గంటల తరువాత వర్షం తగ్గడంతో మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆటకు సిద్ధం చేశారు. ఆపై మరో 20 నిమిషాల్లో తిరిగి ఆట ప్రారంభంకానుంది అనంగా.. వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు.

వర్షం వల్ల మ్యాచ్‌ నిలిచిపోయేసరికి భారత్ స్కోరు.. 24.1 ఓవర్లలో 147/2. విరాట్ కోహ్లీ (8 నాటౌట్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) అర్ధ సెంచరీలు బాది జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

ALSOREAD: షాహీన్ ఆఫ్రిదినా..! తొక్కా..: రోహిత్‌ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
 

కాగా, లీగ్‌ స్టేజ్‌లో దాయాదుల మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. సూపర్- 4 దశలో సోమవారం రిజర్వ్‌ డేగా ప్రకటించినప్పటికీ.. ఇదీ వర్షార్పణం అయ్యేలా కనిపిస్తోంది. సోమవారం కూడా వాతావరణం అనుకూలంగా లేదు. వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.