Asia Cup 2023: ఆ ఇద్దరూ మిస్.. BCCI మళ్లీ అదే తప్పు చేస్తోందా?

Asia Cup 2023: ఆ ఇద్దరూ మిస్.. BCCI మళ్లీ అదే తప్పు చేస్తోందా?

నిరీక్షణకు తెరదించుతూ బీసీసీఐ నేడు( సోమవారం) ఆసియా కప్‌ 2023కు భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు నేడు న్యూఢిల్లీలో సమావేశమై ఈ టోర్నీ కోసం మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే, ఈ జట్టుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

తొలి మూడు స్థానాలు కంఫర్మ్

రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మాన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. ఈ మూడు స్థానాలలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇక నాలుగో స్థానానికి శ్రేయాస్ అయ్యర్/ సూర్యకుమార్ యాదవ్‌ పోటీ పడుతుండగా.. కెఎల్ రాహుల్‌/ఇషాన్ కిషన్ లలో ఒకరు వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకోనున్నారు. అనుభవం దృష్ట్యా రాహుల్ వైపే మొగ్గు చూపొచ్చు

ఆల్‌రౌండర్ల కోటాలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా స్థానాలు కంఫర్మ్ కాగా.. మరో ఆల్‌రౌండర్ కావాలనుకుంటే అక్షర్‌ పటేల్‌/ శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరిని ఎంపిక చేయొచ్చు. ఇక పేస్ బౌలర్లుగా జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌‌లకు జట్టులో స్థానం దక్కొచ్చు. 

ధావన్ ఎక్కడ..?

పూర్తి ఫిట్‌నెస్ సాధించని అయ్యర్/ రాహుల్‌, వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యపై ఉన్న ఆసక్తి.. బీసీసీఐకి శిఖర్ ధావన్ పై ఎందుకు లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ధావన్, ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకుంటాడని అందరూ ఆశించారు. కానీ టీమిండియా యాజమాన్యం అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది.

చాహల్‌కు అన్యాయం

స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కు ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్పిన్‌కి అనుకూలించే పిచ్‌ల్లో కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్ కంటే చాహాల్‌కే మెరుగైన రికార్డు ఉంది. అలాంటి ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టారన్నది అంతుపట్టని విషయం. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో చేసిన తప్పే.. బీసీసీఐ మరోసారి చేస్తోందని అభిమానులు చెప్తున్నారు.

ఆసియా కప్ 2023కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

స్టాండ్ బై ప్లేయర్: సంజూ శాంసన్