భారత జట్టా..? ముంబై జట్టా..? ఆసియా క‌ప్ స్క్వాడ్‌పై నెటిజెన్ల సెటైర్లు

భారత జట్టా..? ముంబై జట్టా..? ఆసియా క‌ప్ స్క్వాడ్‌పై నెటిజెన్ల సెటైర్లు

ఆసియా కప్ 2023 పోరు కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాణించని ఆటగాళ్లకు వత్తాసు పలుకుతూ.. ఒకే ఐపీఎల్ ప్రాంఛైజీకి చెందిన 8 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. ఇది భారత జట్టు కాదని.. మినీ ముంబై జట్టు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాకపోతే అభిమానుల లెక్కలు వాస్తవానికి కాస్త భిన్నంగా ఉండటం గమనార్హం.         

అప్పుడు దేశ‌వాళీ.. ఇప్పుడు ఐపీఎల్

ఒక‌ప్పుడు జాతీయ జ‌ట్టులోకి రావాలంటే దేశ‌వాళీ ట్రోఫీలే దిక్కు. అది కూడా నిల‌క‌డగా రాణిస్తేనే సెలెక్ట‌ర్ల నుంచి పిలుపు వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటున్నారు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌లు, అత్యంత త‌క్కువ ఎకాన‌మీ ఉంటే చాలు ఒంటిమీద‌కి టీమిండియా జెర్సీ వచ్చేస్తోంది. అవును..ఆసియా క‌ప్‌‌కు ఎంపిక చేసిన భారత జట్టే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 

ముంబైకి ఆడితే.. భారత జట్టులోకి ఎంట్రీ!

వాస్తవానికి ఆసియా కప్‌కు ఎంపికచేసిన 17 మందిలో ఐదుగురు మాత్రమే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు. కానీ అభిమానులు మాత్రం.. 8 మందిగా లెక్కలతో సహా ట్వీట్లు చేస్తున్నారు. వీరిలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కాగా.. శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ గతంలో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడిన విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన హార్దిక్ పాండ్యాను ఈ లెక్కల్లో కలుపుతున్నారు.

ఆసియా క‌ప్ స్క్వాడ్‌ - ఐపీఎల్ ఫ్రాంచైజీ (ప్లేయర్స్)

  • ముంబై ఇండియ‌న్స్: రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), జ‌స్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిష‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ. 
  • గుజ‌రాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, మ‌హమ్మ‌ద్ ష‌మీ.
  • రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు: విరాట్ కోహ్లీ, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్
  • కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్: శ్రేయాస్ అయ్య‌ర్, శార్దూల్ ఠాకూర్.
  • ఢిల్లీ క్యాపిట‌ల్స్: కుల్దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్
  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్: కేఎల్ రాహుల్
  • చెన్నై సూప‌ర్ కింగ్స్: ర‌వీంద్ర జ‌డేజా
  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్: ప్ర‌సిధ్ కృష్ణ‌
  • పంజాబ్ కింగ్స్: అర్ష్‌దీప్ సింగ్

ఆసియా కప్ 2023కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, షమీ శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ.

రిజర్వ్ ప్లేయర్: సంజు శాంసన్