జై షా దెబ్బకు పాక్ విలవిల.. డబ్బు కోసం శ్రీలంక క్రికెట్ బోర్డుతో ఆర్థిక వైరం

జై షా దెబ్బకు పాక్ విలవిల.. డబ్బు కోసం శ్రీలంక క్రికెట్ బోర్డుతో ఆర్థిక వైరం

గతేడాది ఆసియన్ దేశాల మధ్య జరిగిన 'ఆసియా కప్ 2023' టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో శ్రీలంకను చిత్తుచేసి టీమిండియా విజేతగా అవతరించింది. ఈ టోర్నీ కారణంగా పాకిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల మధ్య ఆర్థిక గొడవలు మొదలయ్యాయి. రెండు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించడంతో ఖర్చులు ఎక్కువయ్యాయని.. సహా హోస్ట్‌గా వ్యవహరించిన శ్రీలంక కొంత మొత్తాన్ని చెల్లించాలని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కోరుతుండగా.. లంక క్రికెట్ బోర్డు(ఎల్‌సీబి) అందుకు అంగీకరించడం లేదు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. 

ఏంటి ఈ వివాదం..?

భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ భారత జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి ఇష్టపడకపోవటంతో ఆసియా కప్ 2023 టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. 4 మ్యాచ్‌లు పాక్ గడ్డపై, 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ క్రమంలో పాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లకు పీసీబీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆటగాళ్ల రాకపోకలకు చార్టర్డ్ విమానాలు, హోటల్ బుకింగ్‌లు, వెన్యూ హైరింగ్ ఫీజులు అంటూ అదనపు ఖర్చులు జరిగాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి పిసిబి ప్రయత్నిస్తోంది. అందుకు సహ హోస్ట్‌గా వ్యవహరించిన శ్రీలంక బోర్డు కొంత మొత్తాన్ని చెల్లించాలని కోరుతోంది. అయితే, అందుకు లంక క్రికెట్ బోర్డు(ఎల్‌సీబి) అందుకు అంగీకరించడం లేదు.  

ఈ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా లేనందున ఆర్థిక భారం తీసుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో తమ నుంచి హోస్టింగ్ హక్కులను తొలగించి హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఆ అదనపు ఖర్చులు చెల్లించాలని పాక్ కోరుతోంది. ఒకవేళ ఏసీసీ అందుకు అంగీకరించకపోతే కేసు వేస్తామని బెదిరిస్తోంది. 

కాగా, ప్రస్తుతం ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా బీసీసీఐ సెక్రటరీ జై షా పదవిలో ఉన్నారు. మరోవైపు, హోస్ట్‌గా ఉండి శ్రీలంక వేదికలను, సౌకర్యాలను ఉపయోగించుకున్నందున పీసీబీ.. ఆ బకాయిలను తక్షణమే లంక బోర్డుకు చెల్లించాలని షా.. ఏసీసీ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఈ బకాయిలు చెల్లించమన్నందుకే పీసీబీ అదనపు ఖర్చుల వాదన తెరమీదకు తెచ్చిందనేది జరుగుతున్న ప్రచారం.