ఆగస్టు 30వ తేదీ నుంచి ఆసియా కప్ 2023 మొదలు కానుంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనబోతున్నాయి. టీమిండియా మోస్ట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే ఆసియాకప్ 2023లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సచిన్ టెండూల్కర్ రికార్డు ఊరిస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఆసియా కప్ లో 971 పరుగులు సాధించాడు. 1990 నుంచి 2012 వరకూ ఆసియా కప్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన సచిన్.... 21 ఇన్నింగ్స్‌లలో 51.10 సగటుతో 971 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు కొట్టాడు. అంతేకాదు భారత్ తరఫున ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసింది సచినే కావడం విశేషం. అయితే ఈ రికార్డుపై రోహిత్, కోహ్లీలు కన్నేశారు.
రోహిత్కు ఎన్ని పరుగులు అవసరం..
ఆసియా కప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ 22 మ్యాచ్‌లు ఆడాడు. 21 ఇన్నింగ్స్‌లలోనే 65.50 సగటుతో 786 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 3 సెంచరీలు, 3 అర్థ సెంచరీలు కూడా సాధించాడు. అయితే సచిన్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ శర్మ మరో 226 పరుగులు చేయాలి.
కోహ్లీకి ఎన్ని పరుగులు అవసరం..
అటు విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఆసియా కప్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. 10 ఇన్నింగ్స్‌లలో 61.30 సగటుతో 613 పరుగులు కొట్టాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక అర్థ సెంచరీ ఉంది. సచిన్ రికార్డును అధిగమించాలంటే కోహ్లీకి మరో 358 పరుగులు సాధించాలి.
ఈ ఆసియాకప్ అధిగమిస్తారా..?
ఆసియా కప్2023లో భారత్ గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సూపర్ - 4లోనూ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్‌కు వెళ్తే ఐదో మ్యాచ్ కూడా ఆడాలి. ఈ ఐదు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ, కోహ్లీ పరుగుల వరద పారిస్తే సచిన్ రికార్డును ఇద్దరు ఈజీగా అధిగమిస్తారు.