ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 ముంగిట ఇండియా- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఆసియా కప్‌లో పాక్ బౌలర్ల పని విరాట్ కోహ్లీ చూసుకుంటాడన్న అజిత్ అగార్కర్ వ్యాఖ్యలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. మాటలు కాదు.. చేతలు ముఖ్యమనేలా ఎటకారంగా వ్యాఖ్యానించాడు.
మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2023 సమరం మొదలుకానుండగా.. సెప్టెంబర్ 2న ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ క్రమంలో పటిష్ఠ పాక్ పేస్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారని టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ను ప్రశ్నించగా.. వాళ్ల సంగతి విరాట్ చూసుకుంటాడని బదులిచ్చాడు.
కోహ్లీ విశ్వరూపం
గతేడాది(2022) జరిగిన టీ20 ప్రపంచకప్‍లో పాక్ బౌలర్లకు కోహ్లీ విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. 8 బంతుల్లో భారత విజయానికి 28 పరుగులు అవసరమైన దశలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కోహ్లీ రెండు భారీ సిక్సర్లు బాది.. టార్గెట్‌ను సులభతరం చేశాడు. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయినా.. జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‍లో కోహ్లీ..53 బంతుల్లోనే అజేయంగా 83 పరుగులు చేశాడు. అలాంటి ప్రదర్శనను కోహ్లీ నుంచి మరోసారి ఆశించవచ్చన్నట్లు అగార్కర్ వ్యాఖ్యానించారు. అయితే, అగార్కర్ కామెంట్లపై పాకిస్థాన్ ఆల్‍రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ లా స్పందించాడు.
"చూడండి.. నేను లేదా ఇంకొకరు కావచ్చు.. లేదా అవతలి వైపు వాళ్లు కావచ్చు.. ఎవరకి అనిపించింది వారు ఏదైనా మాట్లాడవచ్చు. దాని వల్ల ఒరిగేదేం లేదు.. మైదానంలోకి దిగాక ఆ రోజు ఏం జరుగుతుందనేదే ముఖ్యం. దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మ్యాచ్ జరిగినప్పుడు కదా అసలేం జరుగుతుందో తెలిసేది.." అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఆసియా కప్ 2023 పోరు కోసం భారత జట్టు మంగళవారం(ఆగష్టు 29) శ్రీలంక బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.