- సూపర్4లో నేడు
- పాకిస్తాన్ x బంగ్లాదేశ్
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
లాహోర్: ఆసియా కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక తప్పించుకుంది. ఆ జట్టును వణికించిన అఫ్గానిస్తాన్ కొద్దిలో సూపర్–4 బెర్త్‌ను దూరం చేసుకుంది. స్టార్టింగ్‌లో అద్భుతంగా ఆడినా ఆఖర్లో తడబడింది. మంగళవారం జరిగిన గ్రూప్–బి చివరి మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 292 రన్స్ టార్గెట్‌ను అఫ్గాన్ 37.1 ఓవర్లలో ఛేజ్ చేస్తే సూపర్4 చేరుకునేది. ఛేజింగ్‌లో అద్భుతంగా ఆడిన అఫ్గాన్ 37 ఓవర్లలో 289/8 రన్స్ చేసింది. మరో బాల్‌కు మూడు రన్స్ కొడితే సూపర్4 బెర్త్ దక్కేది. కానీ, ఈ బాల్‌కు ముజీబుర్ (0) ఔటయ్యాడు. మరో మూడు బాల్స్‌లో ఆరు రన్స్ కొడితే టోర్నీలో ముందుకెళ్లే అవకాశం ఉండగా.. ఫజల్‌హక్ (0) ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో, 37.4 ఓవర్లలో 289 రన్స్‌కు ఆలౌటైన అఫ్గాన్ 2 రన్స్ తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. ఓటమి తప్పించుకున్న శ్రీలంక సూపర్4 బెర్తు దక్కించుకుంది.
మహ్మద్ నబీ (65), హష్మతుల్లా షాహిది (59), రెహమత్ షా (45), రషీద్ (27 నాటౌట్) పోరాడినా అఫ్గాన్ నెగ్గలేకపోయింది. లంక బౌలర్లలో కాసున్ రజిత 4 వికెట్లు తీశాడు. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 291/8 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (84 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) చెలరేగాడు. పాథుమ్ నిశాంక (41), కరుణరత్నె (32), చరిత్ అసలంక (36)తో పాటు చివర్లో దునిత్ (33 నాటౌట్), తీక్షణ (28) విలువైన రన్స్‌తో ఆకట్టుకున్నారు. గుల్బాదిన్ నైబ్ 4, రషీద్ 2 వికెట్లు తీశారు. కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గ్రూప్–ఎ నుంచి ఇండియా, పాక్, గ్రూప్–బి లంక, బంగ్లా సూపర్–4 చేరుకున్నాయి. మరోవైపు సూపర్–4, ఫైనల్ మ్యాచ్‌లను హంటన్‌టోటాకు తరలించాలని భావించిన ఏసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఈ మ్యాచ్‌లు కొలంబోలోనే జరుగుతాయి.