న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత.. ఆసియా కప్ వేదిక ఎక్కడ అనేది నిర్ణయిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం స్పష్టం చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు చెందిన పెద్దలు మెగా ఫైనల్ చూసేందుకు వస్తున్నారని, వారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథీని ఈ ఫైనల్‌కు ఆహ్వానించారా? లేదా? అన్నది తేలలేదు. ‘ఆసియా కప్ నిర్వహణ ఎక్కడ అనేది ఇంకా తేలలేదు.
మేం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాం. దానిపై చర్చించే టైమ్ మాకు లేదు. ఫైనల్ ముగిసిన తర్వాత ఆసియా కప్‌పై కచ్చితంగా మాట్లాడతాం. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ బోర్డు చైర్మన్‌లను ఐపీఎల్ ఫైనల్‌కు ఆహ్వానించాం. వాళ్లు వచ్చిన తర్వాత చర్చలు జరుపుతాం. అందరు ఆమోదించేలా ఓ నిర్ణయానికి వస్తాం’ అని షా పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాక్‌లో జరగాల్సి ఉండగా.. అక్కడికి టీమ్‌ను పంపించేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను మిగతా సభ్య దేశాలు తిరస్కరించ డంతో ఆసియా కప్ నిర్వ హణ సందిగ్ధంలో పడింది.