Asia Cup 2023: ఇండియా vs నేపాల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే భారత్ పరిస్థితి ఏంటి?

Asia Cup 2023: ఇండియా vs నేపాల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే భారత్ పరిస్థితి ఏంటి?

ఆసియా కప్‌ 2023లో భారత్ మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేలా కనిపించడం లేదు. ఇప్పటికే దాయాదుల పోరును సగంలోనే నిలిపివేసి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. ఇండియా- నేపాల్ మ్యాచ్ జరిగే రోజు ఎంట్రీ ఇవ్వడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.  

సోమవారం (సెప్టెంబరు 4న) భారత్‌- నేపాల్ మధ్య పల్లెకెలె వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కూ వర్ష ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే రోజు అనగా సెప్టెంబర్ 4న 80 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. వర్షం ప్రభావంతో టాస్‌ కూడా ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ అనుకున్న సమయానికి మ్యాచ్‌ ప్రారంభమైనా.. ఆట మధ్యలో అంతరాయం తప్పకపోవచ్చు.

ఈ మ్యాచ్‌ రద్దయితే భారత్ పరిస్థితి ఏంటి..?

నేపాల్‌తో మ్యాచ్‌ జరిగితే భారత్‌ విజయం సాధించడమన్నది ఖాయం. అదే వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. తద్వారా టీమిండియా రెండు పాయింట్లతోసూపర్-4కు అర్హత సాధించి.. నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే సూపర్‌-4లో భాగంగా సెప్టెంబరు 10న ఇండియా - పాకిస్థాన్‌ మరోసారి తలపడవచ్చు. నేపాల్‌పై విజయం, భారత్ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఇప్పటికే సూపర్‌-4కు దూసుకెళ్లింది.