కొలంబో : వరుసగా రెండు విజయాలతో ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్ చేరుకుంది. మరో ఫైనల్ బెర్తు కోసం గురువారం జరిగే సూపర్4 మ్యాచ్‌లో పాకిస్తాన్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లూ బంగ్లాదేశ్‌పై గెలిచి.. ఇండియా చేతిలో ఓడిపోయాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్ చేరనుంది. దాంతో లంక, పాక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇండియా చేతిలో చిత్తయిన పాక్ గాయాల కారణంగా నసీమ్ షాతో పాటు మరో పేసర్ హారిస్ రవూఫ్ సేవలు కోల్పోనుంది. ఇది ఆ జట్టుకు మైనస్ కానుంది. ఇక, ఓపెనర్లు ఇమాక్, ఫఖర్ జమాన్, కెప్టెన్ బాబర్‌పైనే ఆ టీమ్ ఎక్కువ ఆధారపడుతోంది. వీళ్లు బాగా ఆడితే గెలుస్తున్న పాక్.. ఫెయిలైతే నిరాశ పరుస్తోంది.
ఈ క్రమంలో రిజ్వాన్, అఘా సల్మాన్ కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మరోవైపు గ్రూప్ దశను కష్టంగా దాటిన శ్రీలంక సూపర్4 తొలి పోరులో బంగ్లాను ఓడించింది. పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆ జట్టు బాగానే పోరాడుతోంది. ఇండియా చేతిలో ఓడినా.. 20 ఏండ్ల యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాలగె అద్భుత పోరాటం ఆ జట్టుకు కొంత ఊరటనిచ్చింది. అతనితో పాటు పతిరణ, తీక్షణ, కాసున్ సత్తా చాటుతున్నారు. దాంతో బౌలింగ్‌లో బాగానే ఉన్నా.. బ్యాటింగ్‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి చెరో పాయింట్ లభిస్తే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న శ్రీలంక ఫైనల్‌కు రానుంది.