Asia Cup 2023: టీమిండియా ఫైనల్ కూడా చేరలేదు.. భారత జట్టుపై వసీం అక్రమ్ విమర్శలు

 Asia Cup 2023: టీమిండియా ఫైనల్ కూడా చేరలేదు.. భారత జట్టుపై వసీం అక్రమ్ విమర్శలు

ఆసియన్ దేశాల క్రికెట్ రారాజు ఎవరన్నది తేలే 'ఆసియా కప్ 2023' సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టును ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గతేడాది టైటిల్ తమదే అంటూ బరిలోకి దిగిన టీమిండియా.. ఆసియా కప్‌ ఫైనల్‌ కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీ.. బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తుండగా..  నేపాల్ జట్టు తొలిసారి ఈ టోర్నీలో ఆడుతోంది. అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు స్పాన్సర్లు ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడిన అక్రమ్.. భారత జట్టు ప్రదర్శనపై విమర్శలు చేశారు. 

డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. గతేడాది ఆసియా కప్‌లో ఫైనల్‌ కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అక్రమ్ తెలిపారు. పేలవ ఆటతీరుతో కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుందని గుర్తుచేశారు. గత ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడతాయని ఊహించామని.. కానీ అనూహ్యంగా శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసిందని అక్రమ్ గుర్తుచేశారు. మ్యాచ్ జరిగిన రోజు ఏ జట్టు బాగా ఆడితే.. ఆ జట్టే ఫైనల్ చేరుతుందని చెప్పుకొచ్చారు.

ఇక, ఆసియా కప్ లో ఆడేందుకు పాక్ పర్యటనకు రాని టీమిండియాపై పీసీబీ వైఖరి ఎలా ఉండనుందన్న ప్రశ్నపై.. అక్రమ్ సానుకూలంగా స్పందించారు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించే విషయం రాజకీయాలతో ముడిపడి ఉందని.. కానీ క్రీడలు, రాజకీయాలను వేరుగా ఉంచాలని అక్రమ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఇరు జట్ల మధ్య రెగ్యులర్ సిరీస్‌లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.