ఆసియా గేమ్స్‌‌లో... హర్మన్‌‌, మన్‌‌దీప్‌‌ హ్యాట్రిక్‌‌ గోల్స్‌‌

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌లో ఇండియా హాకీ టీమ్‌‌ మరోసారి గోల్స్‌‌ వర్షం కురిపించింది. మంగళవారం జరిగిన పూల్​​–ఎ రెండో మ్యాచ్‌‌లో 16–1తో సింగపూర్‌‌ను చిత్తు చేసింది. ఇండియా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (24, 39, 40, 42వ ని.), మన్‌‌దీప్‌‌(12, 30, 51వ ని.) హ్యాట్రిక్‌‌ గోల్స్‌‌తో చెలరేగగా, అభిషేక్‌‌ (51, 52వ ని.), వరుణ్‌‌ (55, 55వ ని.), లలిత్‌‌ (16వ ని.), గుర్జాంత్‌‌ (22వ ని.), వివేక్‌‌ (23వ ని.), మన్‌‌ప్రీత్‌‌ (37వ ని.), షంషేర్‌‌ (38వ ని.) మిగతా గోల్స్‌‌ చేశారు. జెడ్‌‌బీజెడ్‌‌ (21వ ని.) సింగపూర్‌‌కు ఏకైక గోల్‌‌ అందించాడు.  గురువారం జరిగే మ్యాచ్‌‌లో ఇండియా డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ జపాన్‌‌తో తలపడుతుంది. 

షూటింగ్‌‌లో బ్రాంజ్‌‌ మిస్‌‌

ఇండియా స్టార్‌‌ షూటర్లు దివ్యాన్ష్​ పన్వర్‌‌–రమిత జిందాల్‌‌..10 మీటర్ల ఎయిర్‌‌ రైఫిల్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో తృటిలో బ్రాంజ్‌‌ మెడల్‌‌ను మిస్సయ్యారు. హోరాహోరీగా సాగిన బ్రాంజ్​ మెడల్​ మ్యాచ్​లో దివ్యాన్ష్​–రమిత 18–20తో పార్క్‌‌ హజున్‌‌–లీ యునెసో (కొరియా) చేతిలో ఓడారు. 

క్వార్టర్స్‌‌లో నాగల్‌‌, అంకిత

టెన్నిస్‌‌లో సుమిత్‌‌ నాగల్‌‌, అంకిత రైనా  క్వార్టర్‌‌ఫైనల్లోకి అడుగుపెట్టారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో సుమిత్‌‌ 7–6 (9), 6–4తో జుకయేవ్‌‌ బిబిట్‌‌ (కజకిస్తాన్‌‌)పై గెలిచాడు. విమెన్స్‌‌లో అంకిత 6–1, 6–2తో ఆదిత్య పాటిల్‌‌ (హాంకాంగ్‌‌)ను చిత్తు చేసింది. ఇతర మ్యాచ్‌‌ల్లో రామ్‌‌కుమార్‌‌ 5–7, 7–6 (3), 5–7తో యుసుకి (జపాన్‌‌) చేతిలో, రుతుజా 6–7 (5/7), 2–6తో అలెక్స్‌‌ (ఫిలిప్పీన్స్‌‌) చేతిలో ఓడారు. మిక్స్‌‌డ్‌‌లో యూకీ భాంబ్రీ–అంకిత 6–0, 6–0తో అఖీల్‌‌ ఖాన్‌‌–సారా ఖాన్‌‌ (పాకిస్తాన్‌‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు.