ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత..నీరజ్ చోప్రా ఏషియన్ గేమ్స్ సత్తా చాటాడు. జావెలిన్ ను 88.88 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ కిశోర్ కుమార్ జెనా రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో ఈ ఇద్దరు అథ్లెట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరూ ఒకరికి మించి మరొకరు జావెలిన్ విసిరారు. కానీ చివరికి నీరజ్ నే స్వర్ణ పతకం వరించింది.
తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 85 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరాడు. అయితే సాంకేతిక లోపంతో ఈ దూరాన్ని లెక్కించలేకపోయారు ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు. దాంతో అతనికి మరో అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో 82.38 మీటర్ల దూరం విసిరాడు నిరజ్. మూడో ప్రయత్నంలో పౌల్ చేసిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో అత్యధికంగా 88.88 మీటర్ల దూరం విసిరాడు. ఐదో ప్రయత్నంలో 80.80 మీటర్లే విసరగా.. మిగతా ప్లేయర్లు.. నీరజ్ చోప్రాను అధిగమించలేదు.
మరో భారత క్రీడాకారుడు కిషోర్ కుమార్ తొలి ప్రయత్నంలో 81.26 మీటర్ల దూరం విసరాడు. రెండో ప్రయత్నంలో 79.76 మీటర్లు.., మూడో ప్రయత్నంలో 86.77 మీటర్లు.., నాలుగో ప్రయత్నంలో 87.54 మీటర్లు విసిరి సిల్వర్ సొంతం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన డీన్ రోడెరిక్ గెన్‌కీ 82.68 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సాధించాడు.