Asian Games 2023: ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం

Asian Games 2023: ఫైనల్‌లో శ్రీలంక చిత్తు.. భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం

చైనా, హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు బంగారం పతకం సాధించింది. సోమవారం శ్రీలంక మహిళా జట్టుతో జరిగిన ఫైనల్‌లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుంది.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టునిర్ణీత 202ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మ్రితి మందాన(46), జెమీమా రోడ్రిగ్స్(42) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రబోధిని, రణవీర, సుగంధిక కుమారి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 117 పరుగుల లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు నిర్ణీత ఓవర్లలో 97 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సందు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా.. రాజేశ్వరి గైక్వాడ్ 2, దీప్తి శర్మ, పూజా వస్ట్రాకర్, దేవికా వైద్య తలో వికెట్ తీసుకున్నారు.

ఆసియా క్రీడల క్రికెట్ విభాగంలో భారత మహిళా జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. మొదటి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించి శభాష్ అనిపించారు.