![ఇండియాకు ఆసియా సవాల్!..నేటి నుంచి ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్](https://static.v6velugu.com/uploads/2025/02/asian-mixed-team-badminton-championship-from-february-11_w4fcbMqmFd.jpg)
- సింధు లేకుండా బరిలోకి దిగుతున్న జట్టు
క్వింగ్డవో (చైనా) : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షట్లర్ పీవీ సింధు లేకుండా ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ట్రెయినింగ్ క్యాంప్‌లో గాయపడ్డ కారణంగా సింధు చివరి నిమిషంలో తప్పుకోవడం మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో జట్టు పతక అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. రెండేండ్ల కిందట దుబాయ్‌లో జరిగిన గత ఎడిషన్‌లో ఇండియా కాంస్య పతకం నెగ్గడంలో సింధు కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు తన గైర్హాజరీలో29వ ర్యాంకర్ మాళవిక బన్సోద్ విమెన్స్ సింగిల్ బాధ్యతలు తీసుకోనుంది.
ఈ టోర్నీలో గ్రూప్–డిలో ఉన్న ఇండియా బుధవారం మకావుతో తన పోరును ఆరంభించనుంది. ఆ తర్వాత బలమైన సౌత్ కొరియా జట్టుతో తలపడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. ఇండియా క్వార్టర్స్ చేరడం పెద్ద కష్టమేం కాకపోయినా.. అక్కడి నుంచి మరింత ముందుకు సాగాలంటే జట్టు నుంచి మెరుగైన పెర్ఫామెన్స్ అవసరం. ఈ టోర్నీలో ఇండియాకు స్వర్ణం అందని ద్రాక్షగానే ఉంది. కానీ, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, థామస్ కప్‌లో గోల్డ్ మెడల్స్,
గతేడాది బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలవడం ఇటీవల కాలంలో టీమ్ ఈవెంట్లలో ఇండియా సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చు. ఈ విజయాల్లో పాలు పంచుకున్న ప్రణయ్, లక్ష్య సేన్, అశ్విని పొన్నప్ప, సాత్విక్–చిరాగ్ షెట్టి ఇప్పుడు ఆసియా మిక్స్‌డ్ టీమ్ టోర్నీలోనూ సత్తా చాటి ఇండియాకు మెరుగైన పతకం అందించాలని కోరుకుంటున్నారు.
సాత్విక్–చిరాగ్‌పై అంచనాలు
డబుల్స్ టాప్ షట్లర్లు సాత్విక్– చిరాగ్‌పై ఈ టోర్నీలో ఇండియా భారీ అంచనాలు పెట్టుకుంది. మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లో ఈ ఇద్దరూ సెమీస్ చేరి ఆకట్టుకున్నారు. ఒలింపిక్స్ తర్వాత గాయాలు, ఆనారోగ్యంతో ఇబ్బంది పడిన సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్, ఈ సీజన్‌లో కొన్ని టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగిన లక్ష్యసేన్ వెంటనే ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. సింధు గైర్హాజరీలో మెన్స్ సింగిల్స్, డబుల్స్‌పై అంచనాలు ఎక్కువగా ఉండనున్నాయి.
విమెన్స్ డబుల్స్‌లో కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కూడా కీలకం కానున్నారు. ఇటీవలే లక్నోలో తమ తొలి సూపర్ 300 టైటిల్ సాధించిన గాయత్రి–ట్రీసా జోడీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి వచ్చింది. వీళ్లకు తోడు అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో రూపంలో అనుభవం, యువబలం కలిసిన మరో జోడీ కూడా అందుబాటులో ఉంది. నేషనల్ గేమ్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న సతీష్ కరుణాకరన్– ఆద్య వరియత్ అదే జోరును ఈ మెగా టోర్నీలోనూ కొనసాగించాలని చూస్తున్నారు.
కానీ, ఈ ఇద్దరికీ అంతగా అనుభవం లేకపోవడం మైనస్ కానుంది. కాగా, ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు మూడు గ్రూపుల్లో పోటీపడుతున్నాయి. గత రెండు ఎడిషన్లలో చాంపియన్‌గా నిలిచిన చైనా, ప్రారంభ ఎడిషన్ అయిన 2017లో టైటిల్ నెగ్గిన జపాన్ ఈసారి కూడా ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.