
- 90 బిలియన్ డాలర్ల సంపదతో నెం.1
- నాలుగో స్థానంలో మిస్త్రీ కుటుంబం
- వెల్లడించిన బ్లూమ్‌బెర్గ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ , ఆయన కుటుంబం ‘బ్లూమ్‌బెర్గ్ ఆసియా అత్యంత సంపన్న కుటుంబాల’ లిస్టులో మొదటిస్థానంలో నిలిచింది. వీళ్ల సంపద 90.5 బిలియన్ డాలర్లని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. టాప్–20 అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో పలువురు భారతీయులు స్థానం సంపాదించారు. వీరిలో మిస్త్రీ కుటుంబం, 37.5 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో భారీ వాటా ఉండటంతో పాటు ఇది షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ను నియంత్రిస్తుంది. జిందాల్ కుటుంబం 28.1 బిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో ఉంది. ఓపీ జిందాల్ గ్రూప్‌కు శక్తి, సిమెంట్ వ్యాపారాలు ఉన్నాయి. బిర్లా కుటుంబం 23 బిలియన్ డాలర్ల నికర విలువతో తొమ్మిదో స్థానంలో ఉంది. వీరికి లోహాలు, సిమెంట్ ఆర్థిక సేవలు వంటి వ్యాపారాలు ఉన్నాయి. ఆసియా వ్యాపారవేత్తల మొత్తం లిస్టులో, థాయిలాండ్‌కు చెందిన చీరవనాంట్ కుటుంబం 42.6 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. ఆసియా అంతటా వీరికి ఆహారం, రిటైల్, టెలికాం వ్యాపారాలు ఉన్నాయి. మూడవ స్థానంలో ఉన్న ఇండోనేషియాకు చెందిన హార్టోనో కుటుంబానికి 42.2 బిలియన్ డాలర్ల సంపద ఉంది. పొగాకు వ్యాపారంతో వీళ్లు భారీగా సంపాదించారు.
ఐదో స్థానంలో క్వాక్ ఫ్యామిలీ
హాంకాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం 35.6 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ నగరంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన సన్ హంగ్ కై ప్రాపర్టీస్ వారి సంపదకు కారణం. ఆరో స్థానంలో తైవాన్ త్సాయ్ కుటుంబం ఉంది. వీరి సంపాదన విలువ 30.9 బిలియన్ డాలర్లు. కాథే ఫైనాన్షియల్, క్యూబన్ ఫైనాన్షియల్‌తో సహా పలు ఆర్థిక సేవల సంస్థలు వీళ్ల సొంతం. థాయిలాండ్‌కు చెందిన యూవిధ్య కుటుంబం 25.7 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, దక్షిణ కొరియాకు చెందిన లీ కుటుంబం లిస్టులో 10వ స్థానంలో ఉంది. ఈ లిస్టులోని ఇతర ముఖ్యమైన ఆసియా కుటుంబాలలో చైనాకు చెందిన జాంగ్ కుటుంబం, హాంకాంగ్‌కు చెందిన చెంగ్ కుటుంబం, భారతదేశానికి చెందిన బజాజ్ ఫ్యామిలీ, హాంకాంగ్‌కు చెందిన పావో/వూ కుటుంబం, క్వెక్/క్వెక్ కుటుంబం, కడూరీ కుటుంబం, థాయిలాండ్‌కు చెందిన చిరతివత్ కుటుంబం, భారతదేశానికి చెందిన హిందూజా కుటుంబం, ఫిలిప్పీన్స్‌కు చెందిన సై కుటుంబం హాంకాంగ్‌కు చెందిన లీ ఫ్యామిలీ ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.