ఆసిఫాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంలో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 597 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 380 బ్యాలెట్ యూనిట్లు, 380 కంట్రోల్ యూనిట్లు, 425 వీవీ ప్యాట్లు, సిర్పూర్ నియోజకవర్గానికి 366 బ్యాలెట్ యూనిట్లు, 366 కంట్రోల్ యూనిట్లు, 410 వీవీ ప్యాట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరచిన అధికారులు
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో ఎలక్షన్ కమిషన్ పంపించిన 283 ఈవీఎంలతో పాటు,317 వీవీ ప్యాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచారు. గదికి తాళాలు వేయించి సీజ్ చేశారు. బెల్లంపల్లి తహసీల్దార్ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.