ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు : ఎన్నికలు తేదీలు ప్రకటించడంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్అమలుపై అధికారులతో అత్యవసరంగా సమావేశమై పలు ఆదేశాలు, సూచనలు చేశారు. మంచిర్యాల కలెక్టరేట్ భవనంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్.. అడిషనల్ కలెక్టర్లు బి.రాహుల్, సబావత్ మోతిలాల్‌తో కలిసి రిటర్నింగ్, ఎలక్షన్‌సెల్, పోలీసు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్చేసిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈఈఎం(ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ)లో ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు
ఫ్లయింగ్ స్వ్కాడ్, స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్, అకౌంటింగ్, ఎక్సైజ్ టీమ్‌లు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఖర్చులపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా పరిధిలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించినట్లయితే తనిఖీల్లో తగిన ఆధారాలు లేకుంటే సీజ్ చేస్తామన్నారు. రూ.10వేల కంటే ఎక్కువ విలువ గల మద్యం తరలించినా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడ హేమంత్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవో సురేశ్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో 597 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల ఫిర్యాదు కోసం కలెక్టరేట్ లో 1950 లేదా 08733279411 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ప్రత్యేక పాంప్లెంట్ ఏర్పాటు చేయకూడదన్నారు.
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్స్‌తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్పీ సురేశ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ నగదు, మద్యం రవాణా వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. అంతకుముందు ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఈవీఎం గోదామును పరిశీలించారు. గోదాము వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
సీసీ కెమెరాలతో నిఘా
ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బార్డర్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ప్రతి చోటా పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. జిల్లాలో ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటల్లో, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 72 గంటల్లో తొలగించనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పేయ్ పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పోలీసు అధికారులు, సిబ్బంది ఎలక్షన్డ్యూటీల్లో అలర్ట్‌గా ఉండాలని రామగుండం పోలీస్‌కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశించారు. కమిషనరేట్హెడ్ క్వార్టర్స్‌లో సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. సీఐలు, ఎస్సైలు తమ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలను గుర్తించి ఎన్నికల నిర్వహణ పరికరాలను తీసుకెళ్లే రూట్లను చెక్ చేసుకోవాలన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు సుధీర్ రాంనాథ్ కేకన్, వైభవ్ గైక్వాడ్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హక్, ఏసీపీలు తులా శ్రీనివాసరావు, ఎడ్ల మహేష్ ,తిరుపతి రెడ్డి, మోహన్, సదయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.