ఎల్ఆర్ఎస్​పై విస్తృత ప్రచారం చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఎల్ఆర్ఎస్​పై విస్తృత ప్రచారం చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: లే అవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపులపై ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఎల్ఆర్ఎస్​పై సోమవారం వాంకిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఎల్ఆర్ఎస్ రుసుము ఈ నెల 31వ తేదీలోగా 100 శాతం చెల్లించినవారికి 25 శాతం మినహాయింపు ఉందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారుడికి సమాచారం అందించాలన్నారు. ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 

డ్యూటీకి రాని హెడ్​ నర్సుకు నోటీసులు

అనంతరం వాంకిడి పీహెచ్​సీని సందర్శించారు. వార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్​ను పరిశీలించారు. విధులకు డుమ్మా కొట్టిన హెడ్ నర్సు కె.విశ్వాసంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సెంటర్​ను తనిఖీ చేసి పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని, గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు చేయాలన్నారు. జడ్పీహెచ్​ఎస్​లోని టెన్త్​ఎగ్జామ్​ సెంటర్​ను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు.