ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి : వెంకటేశ్ ధోత్రే

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి : వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఈనెల 24న ఆస్పత్రిలో సిజేరియన్​ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చిన ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన లోబాడే శోభను పరామర్శించి పండ్లు అందించారు. 

ఆస్పత్రిలో ఎక్కువ సంఖ్యలో ప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రతి గర్భిణికి అవసరమైన పరీక్షలు చేసి సురక్షిత కాన్పు చేయాలని  వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులతో రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన బెడ్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో కొనసాగుతున్న సదరం క్యాంప్ ను సందర్శించారు. 

మొక్కలను సిద్ధంగా ఉంచాలి 

జిల్లా కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న నర్సరీని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే డీఆర్డీఓ సురేందర్ తో కలిసి సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎండిపోకుండా, వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే వజ్రోత్సవ వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ఒమర్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.