- ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ బాల రక్షాభవన్ను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో కలిగే నష్టాలు ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. బాలల సంరక్షణకు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్1098కు ఫిర్యాదులు, సమాచారం అందించాలన్నారు. బాలల హక్కుల చట్టం ప్రకారం బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐసీడీఎస్ పీడీ భాస్కర్, డీసీపీఓ మహేశ్ పాల్గొన్నారు.