ఆసిఫాబాద్, వెలుగు: జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని , అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. జిల్లాలో జరిగే ప్రతి ప్రసవం ఆస్పత్రిలోనే జరిగేలా వైద్య సిబ్బంది చూడాలన్నారు.
ఇందుకు గర్భిణులను గుర్తించి వారికి తొమ్మిది నెలలపాటు అవసరమైన పౌష్టికాహారం అందించడంతోపాటు సుఖప్రసవానికి కృషి చేయాలన్నారు. అప్పుడే వైద్య సేవలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలుగుతుందని అన్నారు. డయాలసిస్ సెంటర్ ను సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారికి సరైన సౌకర్యాలు అందించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 320 పడకల ఆసుపత్రిని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.