
- సన్నబియ్యం పంపిణీతో మహారాష్ట్రకు ఆగిన అక్రమ రవాణా
- జీర్ణించుకోలేకపోతున్న దళారులు
- వెలవెలబోతున్న మహారాష్ట్రలోని కొనుగోలు కేంద్రాలు, గోదాములు
- రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లకు తగ్గిన తలనొప్పి
ఆసిఫాబాద్ , వెలుగు: సర్కార్ రేషన్ షాపుల్లో మొదలుపెట్టిన సన్న బియ్యం పంపిణీతో బియ్యం అక్రమ దందాకు బ్రేకులు పడ్డాయి. ప్రతీ నెల మొదటి 15 రోజుల పాటు ఆసిఫాబాద్జిల్లాలో దొడ్డు బియ్యం దందా యథేచ్ఛగా సాగేది. ఇప్పుడు ఆ దందాకు అడ్డుకట్ట పడింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే అంతకుముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేయగా లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొని దళారులు మహారాష్ట్రకు తరలించేవారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఆటోలు, బొలెరోలు, వ్యాన్ ల ద్వారా పొద్దూ మాపు తేడా లేకుండా బియ్యం సరఫరా చేసేవాళ్లు.
ఇందుకు ప్రత్యేకంగా నెట్వర్క్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ అండతో లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఉపాధి పొందిన వారు వందల్లో ఉన్నారు. సర్కార్ ఏప్రిల్ నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తుండడంతో బియ్యం దందాకు బ్రేక్‌పడింది. దశాబ్ద కాలంగా నిత్యం రేషన్ బియ్యం పట్టివేత కేసులు నమోదు, వాహనాల సీజ్ అంటూ రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు తలనొప్పి ఉండేది. దొడ్డు బియ్యం దందాకు చెక్ పడడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలో వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు
తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యానికి లబ్ధిదారులు తక్కువ ధరకు అమ్ముకోవడంతో మహారాష్ట్రలో కొనుగోలు చేసేందుకు అక్కడి వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. బియ్యం దందా కోసం వ్యాపారులు అక్కడ ఫుడ్ గ్రెయిన్ లైసెన్స్ తీసుకుని దినుసులు కొనే పేరిట కేవలం బియ్యాన్ని కొనేందుకు గోడౌన్లు నిర్మించారు. సరిహద్దుగా ఉన్న నదీ ఒడ్డున ఉన్న పొడ్సాతో పాటు బంగారం తలొడి, వీరూర్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దళారులు ఇక్కడ రేషన్ షాపుల దగ్గరే కేజీ రూ.12 నుంచి రూ.14 వరకు కొని అక్కడ రూ.20–22 అమ్మేవారు.
మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న జిల్లా కావడంతో వాంకిడి, సిర్పూర్ టీ మండలం గుండా, వెంకట్రావ్‌పేట్ వద్ద వార్దా నదిమీదుగా, చింతలమానేపల్లి మండలం గూడెం అంతరాష్ట్ర హై లెవల్ బ్రిడ్జి మీదుగా గంటల వ్యవధిలోనే బియ్యం సరఫరా జరిగేది. దొడ్డు బియ్యం ప్లేస్ లో కాంగ్రెస్ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడం అక్రమ వ్యాపారులకు మింగుడు పడడం లేదు. సన్న బియ్యం అమ్మేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంలేదు. దీంతో బియ్యం అక్రమ దందాకు ఫుల్స్టాప్ పడింది. తెలంగాణ రేషన్ బియ్యం మీదే ఆధారపడి ఏర్పాటు చేసుకున్న కొనుగోలు కేంద్రాలు, గోదాములు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
ఊపిరి పీల్చుకుంటున్న ఆఫీసర్లు
అక్రమ దందా జిల్లాలో పోలీస్, రెవెన్యూ శాఖలకు పెద్ద తలనొప్పిగా ఉండేది. కంట్రోల్ చేసేందుకు రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు పకడ్బందీ వ్యూహం రూపొందించినా అక్రమార్కుల ముందు పారేదికాదు. కొన్నిసార్లు వెహికల్స్‌ను పట్టుకొని సీజ్ చేసినా అది నామమాత్రమే. విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసినా అక్రమ దందా ఆగేది కాదు. సన్నబియ్యం పంపిణీతో తమ విధి నిర్వహణకు సమస్యగా మారిన దందా పూర్తిగా ఆగడంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.