వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
  • అడవి పందిని వేటాడిన ఏడుగురిని అరెస్ట్​ చేశాం
  • అడవుల రక్షణలో రాజీ లేదు: డీఎఫ్​వో

ఆసిఫాబాద్, వెలుగు: వన్య ప్రాణులను రక్షించడం ఫారెస్ట్ ఆఫీసర్ల కర్తవ్యమని, రాజీపడే ప్రసక్తే లేదని ఆసిఫాబాద్ డీఎఫ్​వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. వన్యప్రాణులను వేటాడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్​లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సిర్పూర్ టీ రేంజ్ పరిధి లక్ష్మీపూర్ లో అడవి పందిని కరెంట్ తీగలు పెట్టి హతమార్చిన నిందితులకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. 

మూడ్రోజుల క్రితం రేంజ్ పరిధిలోని బెంగాలీ క్యాంప్​కు చెందిన అశోక్ ఠాకూర్, దీపక్ ఠాకూర్, ప్రణబ్ మండల్, అరవింద్ దరామి, గౌతం సర్కార్, శంకర్ బెపారి, కమలేశ్ ఠాకూర్, కమ్మరి పోషమల్లు కలిసి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు పెట్టి అడవి పందిని హతమార్చారని తెలిపారు. రేంజ్ సిబ్బంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు. కమలేశ్ ఠాకూర్ మినహా మిగిలిన ఏడుగురిని మంగళవారం తెల్లవారజామున కోర్టులో రిమాండ్ చేశామన్నారు. కాగజ్​నగర్ రేంజ్​లో గతంలో ఇచ్చిన పోడు భూముల వాస్తవ వివరాలు తెలుసుకొని నివేదిక తయారు చేసేందుకే సర్వే చేస్తున్నామని, రైతులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు.