అపార్ నమోదు వెరీ స్లో.. ఆధార్ మిస్ మ్యాచ్​తోనే అసలు లొల్లి

అపార్ నమోదు వెరీ స్లో.. ఆధార్ మిస్ మ్యాచ్​తోనే అసలు లొల్లి
  • వివరాల నమోదులో తీవ్ర జాప్యం
  • ఇప్పటివరకు నమోదు చేసింది 50.6 శాతం మాత్రమే
  • ఆధార్ మిస్ మ్యాచ్​తోనే సమస్య

ఆసిఫాబాద్, వెలుగు:   ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న ప్రతి స్టూడెంట్​కు ఆధార్ కార్డ్ తరహాలో ఒక గుర్తింపు సంఖ్య ఇచ్చి వారు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో చదివిన సులభంగా వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం ప్రారంభించిన అపార్ (ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజస్ట్రీ) ఆసిఫాబాద్​జిల్లాలో మందకొడిగా సాగుతోంది. స్టూడెంట్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకే చోట నిక్షిప్తం చేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన అపార్​లో జిల్లాలో సగం మంది స్టూడెంట్ల వివరాలు మాత్రమే నమోదుయ్యాయి. 

జిల్లాలో 1261 స్కూళ్లలో లక్షా 495 మంది స్టూడెంట్స్ చదువుతుండగా.. ఇప్పటి వరకు 50,759 మంది స్టూడెంట్లకు సంబంధించి మాత్రమే అపార్ ఐడీ కోసం వివరాలు నమోదు చేశారు. 50.6 శాతం మాత్రమే స్టూడెంట్స్ నమోదయ్యారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు వంటి తప్పిదాల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఒకే చోట పూర్తి వివరాలు

ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఉన్నట్లే.. విద్యార్థులకు సైతం అపార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర విద్యా శాఖ కార్యాచరణ ప్రారంభించింది. విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కార్డులో నమోదు చేస్తారు. అపార్​లో స్టూడెంట్ పేరు, ఊరు, పుట్టిన తేదీ, పాస్ ఫొటో, ఆధార్ తరహాలో 12 అంకెల గుర్తింపు సంఖ్య, స్కాన్ ద్వారా వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఆ కార్డుపై ముద్రిస్తారు. స్టూడెంట్లను స్కూళ్లలో జాయిన్ చేసేటప్పుడు నమోదు చేసిన వివరాలు ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా ఉంటేనే అపార్ నంబర్ జనరేటర్ అవుతుంది. 

పాఠశాలల్లో వివరాలు మార్చేందుకు వీలుండదు. కానీ ప్రస్తుతం ఆధార్ కార్డ్, బర్త్​సర్టిఫికెట్ ఆధారంగా మార్పు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఎంఈవో, హైస్కూళ్లలో డీఈవోలకు మార్పులు చేసే అధికారాన్ని విద్యాశాఖ కల్పించింది. పాఠశాల రికార్డులను మార్చవద్దనుకుంటే కచ్చితంగా ఆధార్ కార్డ్ అప్​డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ కార్డుపై ఉన్న నంబర్ ను కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖ వెబ్​సైట్​లో నమోదు చేస్తారు. తరగతుల వారీగా మార్కులు, వ్యక్తిగత వివరాలు, ఎంతవరకు చదువుతున్నారనే సర్టిఫికెట్లు భద్రపరుచుకోవచ్చు. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్​కు మారే సమయంలో అపార్ కార్డు ప్రామాణికంగా మారుతుంది. పై చదువులు, ఉద్యోగాలకు వెళ్లిన కార్యాలయాల్లో అపార్ ఆధారంగా పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఆధార్​లో ఒకటి.. స్కూల్​లో మరోటి

అపార్​లో స్టూడెంట్ వివరాలు మొత్తం నమోదు చేసేందుకు విద్యార్థి తండ్రి ఆధార్ కార్డు సైతం నమోదు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్టూడెంట్, తండ్రి ఇంటి పేర్లలో ఎలాంటి తేడాలున్నా అపార్ ఐడీ క్రియేట్ కావడం లేదు. జిల్లాలో వేల మంది స్టూడెంట్స్ ఇదే కారణంగా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరం ఉండడంతో మీసేవా కేంద్రాల్లో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పుట్టిన రోజు, పేరు ఆధార్​ కార్డులో ఒకలాగా, స్కూల్​లో మరో లాగా ఉండడంతో అపార్ ​ఐడీ క్రియేట్​కాక వేల మంది స్టూడెంట్స్ సమస్య ఎదుర్కొంటున్నారు.

 ఆధార్ కరెక్షన్ కోసం మీ సేవా సెంటర్లు, బ్యాంకుల్లో కొన్ని చోట్ల మాత్రమే అవకాశం ఉండడంతో అక్కడ రద్దీ కారణంగా, సాంకేతిక సమస్యల వల్ల లేట్​అవుతోంది. ఈ విద్యా సంవత్సర ముగింపు దశలో ఉండడంతో వచ్చే విద్యాసంవత్సరంలోనే ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అప్లై చేసి నెల రోజులైనా సర్టిఫికేట్ రావడం లేదని, వందశాతం కంప్లీట్ కోసం ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని టీచర్లు కోరుతున్నారు.