గుట్కా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం : డీవీ శ్రీనివాసరావు

గుట్కా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం : డీవీ శ్రీనివాసరావు
  • ఒక్క ప్యాకెట్ దొరికినా కఠిన చర్యలు: ఎస్పీ
  • రూ.8 లక్షల విలువైన గుట్కా పట్టివేత

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, తంబాకు ఆనవాళ్లు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లేకుండా చేయడమే లక్ష్యమని.. జిల్లా వ్యాప్తంగా గుట్కా, డ్రగ్స్​ను రూపుమాపేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆఫీస్ వెనుక ఉన్న గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.8 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు. 

మహారాష్ట్రలోని చంద్రాపూర్​కు చెందిన అమిత్ కట్కంవార్, గుర్నులే వాడి అక్రమంగా గోదాంలో నిల్వ ఉంచిన గుట్కాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా విక్రయించినా.. పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేసినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గుట్కా పట్టుకున్న టాస్క్​ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐలను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ సదయ్య, సీఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.