ఎన్నికల వేళ అలర్ట్​గా ఉండాలి : ఎస్పీ సురేశ్​కుమార్

కాగజ్ నగర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీసులు అలర్ట్​గా ఉండాలని ఆసిఫాబాద్ ​ఎస్పీ సురేశ్​కుమార్ సూచించారు. గురువారం ఆయన కాగజ్ నగర్ డివిజన్​లో పర్యటించారు. కౌటల మండలం తుమ్మిడిహట్టి వద్ద ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్,  కాగజ్ నగర్ మైసమ్మ గుడి చెక్​పోస్ట్​ను పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం, డబ్బు, గంజాయి

మాదకద్రవ్యాలతోపాటు ఓటర్లను ప్రభావితం చేసే బహుమతులు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. కౌటాల పోలీస్ స్టేషన్​ను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్​ఐ మధుకర్ ఉన్నారు.