
- అవకతవకలు జరగలే
- సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్కు కులగణనపై మాట్లాడే హక్కులేదు
- వివరాలిచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉంది: మంత్రి పొన్నం
- ఏ ఆధారాలతో బీసీల జనాభాను తగ్గించామని చెప్తున్నరు?
- జస్టిస్ ఈశ్వరయ్య, వకుళాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు?
- వివరాలు ఇవ్వనివాళ్లు మండల ఆఫీసుల్లో ఇవ్వొచ్చని సూచన
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించారని ఆరోపిస్తున్న వాళ్లు అందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. సోమవారం సెక్రటేరియెట్ లో మీడియాతో మంత్రి చిట్‌చాట్ చేశారు. గ్రామాలు, వార్డుల వారీగా.. కులాల వారీగా జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద పక్కాగా ఉన్నాయన్నారు. 2014లో చేపట్టిన సమగ్ర సర్వే వివరాలు అందుబాటులో లేనపుడు, ఆ వివరాలతో ప్రస్తుత కులగణన వివరాలను ఎలా కంపేర్చేస్తారని మంత్రి ప్రశ్నించారు.
కులగణన గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని, సర్వేలో ఎమ్మెల్సీ కవిత తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనలేదని ఆయన గుర్తు చేశారు. సర్వేకు సహకరించనివాళ్లకు సర్కారును విమర్శించే హక్కులేదన్నారు. కొన్ని చోట్ల సర్వేకు ఎన్యుమరేటర్లు వెళితే కుక్కలను వదిలి భయాందోళన సృష్టించారని మంత్రి మండిపడ్డారు. కులగణన వివరాల గురించి మాట్లాడే జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ సర్వేలో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు.
50 రోజుల పాటు కులగణన జరిగితే వారిద్దరికీ కనీసం ఒక్కరోజైనా వివరాలు ఇచ్చే తీరిక దొరకలేదా అని చురకలు అంటించారు. సర్వేలో పాల్గొనని వాళ్లు ఇప్పటికైనా మండల ఆఫీసులకు వెళ్లి వివరాలు ఇవ్వాలని మంత్రి కోరారు. డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగలేదని, కంప్యూటర్ ఆపరేటర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. కులగణన , ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందుకోసం119 మందికి అసెంబ్లీ సెక్రటరీ సమాచారం పంపారన్నారు. అసెంబ్లీలో చర్చ చేయాలో.. తీర్మానం చేయాలో కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 98 మంది సభ్యుల మద్దతు అవసరమని మంత్రి చెప్పారు.
పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి..
జనాభా ఎంత ఉందో.. రిజర్వేషన్లు అంత ఉండాలని రాహుల్ గాంధీ చెప్పారని, ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో పొన్నం మాట్లాడారు. 50 రోజులు జరిగిన కులగణన సర్వేలో పాల్గొనకుండా ఇపుడు తమ ఇంటికి ఎన్యుమరేటర్లు రాలేదనడం కరెక్ట్ కాదన్నారు. కులగణన వివరాల్లో లోపాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకరావాలని ఆయన సూచించారు. ప్రధాన పార్టీల నేతలు సర్వేలో పాల్గొనలేదన్నారు. చాలా ఏండ్ల తరువాత బీసీలకు మేలు జరుగుతోందని, అడ్డుకోవాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన బీసీ సంఘాలను హెచ్చరించారు.