
- అడవీ ప్రాంతంలో 20 కి.మీ. నడిచిన ఏఎస్పీ చిత్తరంజన్
తిర్యాణి, వెలుగు: అటవీ మార్గాల్లో దాదాపు 20 కిలోమీటర్లు నడిచి గిరిజన గ్రామాల్లోని సమస్యలు తెలుసుకున్నారు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్. ఆదివారం గుట్టలు ఎక్కి దిగుతూ తిర్యాణి మండలంలోని గోవెన, కుర్సెంగగుడా, నాయక్పాడ్ గుడా గ్రామాలను సందర్శించారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలకు దూరంగా ఉన్న ఆ మారుమూల అటవీ ప్రాంత ఆదివాసీలకు డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా యువతకు వాలీబాల్ కిట్లు, టీషర్టులు పంపిణీ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించి, చికిత్సకు తోడ్పాటు అందిస్తామన్నారు. చిన్నారులకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు కాలినడకన వస్తూ గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసుకున్నానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యువత మావోయిస్టుల ప్రభావానికి గురికావద్దని సూచించారు. అసాంఘిక శక్తులకు తోడ్పాటు అందించకూడదన్నారు. గంజాయి వంటి నిషేధిత పంటలు సాగుచేయొద్దని హెచ్చరించారు. రెబ్బెన సీఐ బుద్దే స్వామి, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది తదితరులున్నారు.