రాఘవ కోసం 8 బృందాలను ఫామ్ చేసి పట్టుకున్నాం

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం బలి కావడానికి ముఖ్య కారణమైన వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనకు పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. రాఘవ అరెస్ట్ పై ఏఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టత ఇచ్చారు. కొత్తగూడెంలో ప్రెస్‎మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. ‘బాధితుడు రామకృష్ణ వనమా రాఘవ, తన తల్లి సూర్యవతి, మాధవి పేర్లు సూసైడ్ నోట్‎లో రాసి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో తన బాధను తెలిపాడు. రాఘవ డబ్బులతో పాటు తన భార్యను కూడా అడిగినట్లు తెలిపాడు. ఘటన జరిగిన రోజే ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించాం. నిందితులను పట్టుకోవడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఏపీ, తెలంగాణలలో సెర్చింగ్ చేపట్టాం. అందులో భాగంగా దమ్మపేట మండలంలోని మందపేట క్రాస్ రోడ్ వద్ద రాఘవను అదుపులోకి తీసుకున్నాం. రాఘవతో పాటు గిరీష్, మురళీ అనే వ్యక్తులను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వీరిద్దరే కాకుండా.. రమాకాంత్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు రాఘవ తప్పించుకోవడానికి సహకరించారు. ఈ నలుగురిని సెక్షన్ 212 కింద అరెస్ట్ చేశాం. రాఘవను ఈ కేసుకు సంబంధించి విచారించాం. ఈ రోజు కొత్తగూడెం కోర్టులో ప్రవేశపెడతాం. రాఘవ ఈ కేసుతో పాటు మరో 12 కేసులలో ముద్దాయిగా ఉన్నాడు’ అని ఏఎస్పీ తెలిపారు.