ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు

ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు

దిస్పూర్ : అస్సాంలోని 700 ఏండ్ల చరిత్ర ఉన్న మొయిదమ్స్​(అహోం చక్రవర్తుల సమాధులు) కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మొయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లు యునెస్కో శుక్రవారం ప్రకటించింది. దీంతో మనదేశంలో ఈశాన్యం నుంచి యునెస్కోలో చోటు దక్కిన తొలిరాష్ట్రంగా అస్సాం రికార్డుకెక్కింది. ఇప్పటిదాకా వరల్డ్ హెరిటేజ్ కమిటీ  168 దేశాల్లోని 1,199 ప్రదేశాలను జాబితాలో చేర్చగా.. 44 సైట్​లు మనదేశంలోనివి ఉన్నాయి. 

ఏడు వందల ఏండ్ల చరిత్ర.. 

బ్రిటిషర్ల రాకకు ముందు తూర్పు అస్సాం ప్రాంతాన్ని అహోం రాజులు దాదాపు 700 ఏండ్లు పాలించారు. వీళ్లు తమ సమాధులను మట్టి, ఇటుక, రాళ్లను వినియోగించి బోలు సొరంగం మాదిరిగా నిర్మించుకున్నారు. వీటిలో అహోం రాజులు, రాణుల ఖననం జరిగింది. రాజు మరణానంతర అవసరాల కోసం కావాల్సిన వస్తువులతోపాటు, సేవకులు, గుర్రాలు, పశువులు, వారి భార్యలను కూడా సమాధిలోని గదుల్లో ఉంచి ఖననం చేసేవారు. ఈజిప్షియన్ల మాదిరిగా వీళ్లు ఖననం ఆచారాలను పాటించారు. అందుకే ఈ సమాధులను పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.