- ‘క్యాబ్’తో లోకల్, నాన్ లోకల్ సమస్య!.. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్లకి మన పౌరసత్వం
- భవిష్యత్తులో తాము మైనారిటీలుగా మారుతామన్న భయంలో స్థానిక అస్సామీలు
- వలస వచ్చి స్థిరపడిన వాళ్లు తమ అవకాశాలు, వనరులు పంచుకుంటారన్న ఆందోళన
రేపటికోసం ఆందోళన పడాలనే కాన్సెప్ట్‌తో అస్సాం మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఆలోచిస్తున్నాయి. లోక్‌సభలో సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్లు (క్యాబ్)’ని ప్రవేశపెట్టినప్పటి నుంచీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఇప్పుడా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తోంది. సిటిజెన్షిప్ యాక్ట్ సవరణకు సంబంధించి ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల కంటే అస్సాంలోనే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు లోకల్ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టేశారు. దీంతో అస్సాంలోని లఖింపూర్, తిన్సుకియా, దిబ్రూగఢ్, కామరూప్ సహా పది చోట్ల ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బిల్లు విషయంలో జనంలో రెచ్చగొట్టే అవకాశముందన్న కారణంతోనే ఆపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఐఎల్పీ, షెడ్యూల్–6 ఈశాన్యానికి కవచాలు
ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే తగినంత రాజ్యాంగ భద్రత ఉందన్నది కేంద్రం వాదన. నార్త్ ఈస్ట్‌లోని ఏడు రాష్ట్రాలకు ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ), షెడ్యూల్–6 ద్వారా నాన్‌లోకల్స్ చొరబడకుండా కానిస్టిట్యూషనల్లో హక్కులు పొందుపరిచారు. దేశంలోని ఇతర రాష్ట్రాలవారు ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్‌లతోపాటు అస్సాంలోని కర్బి అంగ్లాంగ్, జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోకి సులభంగా ప్రవేశించలేరు. వీరు ఆయా చోట్లకు వెళ్లాలంటే ముందుగా ఐఎల్పీ తీసుకోవాలి. దానిలో తాము ఎన్నాళ్లు ఉంటామన్నదికూడా స్పష్టంగా మెన్షన్ చేయాలి. గతంలో మణిపూర్‌లో ఇది ఉండేది కాదు. క్యాబ్ బిల్లు ఆమోదంతోపాటు ఐఎల్పీలోకి మణిపూర్‌ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే రకమైన ప్రొటెక్షన్ తమకుకూడా కల్పించాలని మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు అడుగుతున్నాయి.
కానిస్టిట్యూషన్లో షెడ్యూల్–6 కిందకు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వస్తాయి. ఈ రాష్ట్రాల్లోని ట్రైబల్ ప్రాబల్య ప్రాంతాల్లో లోకల్ ట్రైబల్స్‌కి భాష, కల్చర్, వనరుల వినియోగం వంటి విషయాల్లో పూర్తి హక్కులుంటాయి. షెడ్యూల్–5లోని షెడ్యూల్డ్ ఏరియాలకంటే భిన్నంగా ఉండే ఆదివాసీ తెగల ప్రాంతాలను షెడ్యూల్–6, ఆర్టికల్ 244 ద్వారా వేరు చేశారు.
అస్సాంపై రెండు యుద్ధాల ప్రభావం
కాగా, సిటిజెన్షిప్ సవరణ బిల్లుకు ఇతర ఈశాన్య రాష్ట్రాలకంటే అస్సాం తీవ్రంగా స్పందిస్తోంది. దీని వెనుక రెండు యుద్ధాలున్నాయి. దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్‌లో పంజాబ్‌తోపాటు, బెంగాల్కూడా రెండుగా చీలిపోయి చేరాయి. ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో తరచు పాకిస్థాన్ తగాదాలకు దిగేది. దీంతో ఈస్ట్ బెంగాల్లో ఉన్న నాన్ ముస్లిం మైనారిటీలు అటు ఇటు ఉన్న పశ్చిమ బెంగాల్లోకి, అస్సాంలోకి ప్రాణభయంతో వచ్చేశారు. ఆ తర్వాత రెండోసారి… తూర్పు బెంగాల్లో భాషాపరమైన ఉద్యమం చెలరేగి, పాకిస్థాన్ నుంచి విడిపోయే దశకు చేరింది. ఆ సమయం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం)లోనూ అస్సాంలోకి బంగ్లా ముస్లింలు, హిందువులు, ఇతర మతస్తులు ప్రవేశించారు. ఈ రెండు సందర్భాల్లోనూ వచ్చినవాళ్లందరికీ సిటిజెన్షిప్ కల్పించినట్లయితే భవిష్యత్తులో తాము మైనారిటీలుగా మారిపోతామన్నది అస్సామీయుల భయం. ఈ కారణంతోనే అస్సాంలో (1951, 1971ల్లో) నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్షిప్ (ఎన్నార్సీ) నిర్వహించాల్సి వచ్చింది.
భాష, కల్చర్ పరంగా లోకల్ అస్సామీ జనాలకు, కొత్తగా వచ్చి చేరినవాళ్లకు చాలా తేడా ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితమే బెంగాలీలను వెనక్కి పంపేయాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒక ఒప్పందం కుదిర్చారు. 1971 మార్చి 25కి ముందున్నవాళ్లను మాత్రమే అస్సామీయులుగా గుర్తించాలని, ఆ కటాఫ్ డేట్ తర్వాత వచ్చినవాళ్లను చొరబాటుదారులుగా చూడాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్షిప్ (ఎన్సార్సీ)కూడా జరిగిపోయింది. అయితే, క్యాబ్ అమల్లోకి వస్తే నాన్ ముస్లింలు మైనారిటీలు సిటిజెన్షిప్ పొందుతారన్నది అస్సాం జనాల ఆందోళన. బరాక్ లోయలో బెంగాలీ మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉంటారు. మిగతా ప్రాంతాల్లోనూ నాన్ అస్సామీ భాషలవాళ్లు పెరుగుతారని భయపడుతున్నారు. స్థానిక ఆదివాసీ తెగలపై బెంగాలీల ప్రభావం పడుతుందని, వనరులను పంచుకుంటారని, తమ అవకాశాలు దెబ్బతింటాయని అంటున్నారు.
ఊచకోతలు, ఉద్యమాల్లో 3,551మంది బలి
వీళ్ల భయానికి కారణం లేకపోలేదు. 1979లో మంగళ్‌దోయి లోక్‌సభా స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా, ఓటర్ల సంఖ్య అమాంతంగా పెరిగింది. దాదాపుగా 70 వేల మంది ఓటర్లు పెరిగినట్లుగా అంచనా వేశారు. అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏర్పడడానికి, ఉద్యమానికి ఈ ఉప ఎన్నికలే కారణం. విదేశీయుల ఏరివేత కోసం ఆరేళ్లపాటు ఉద్యమించింది. ఓటర్ల లిస్టులో కొత్తగా చేరినవాళ్లందరి వివరాలను పరిశీలించి, విదేశీయులుగా గుర్తించి, వెనక్కి పంపేయాలన్నది ఆసు ఉద్యమ లక్ష్యం. మంగళ్‌దోయి బైపోల్లో నామినేషన్ వేయకుండా ఆసు విద్యార్థులు అడ్డుకోవడంతో అప్పటి అస్సాం ఇనస్పెక్టర్ జనరల్ (ఐజీపీ) కె.పి.ఎస్.గిల్ లాఠీ చార్జికి ఆదేశించారు. బార్పేట ఆసు యూనిట్ జనరల్ సెక్రటరీ ఖర్గేశ్వర్ తాలూకుదార్ (22)ని పోలీసులు బాగా కొట్టడంతో, అతను చనిపోతే ఒక గుంతలో పడేశారు. అస్సాం మూవ్మెంట్లో అతనే తొలి అమరుడిగా నేటికీ గుర్తిస్తారు. తాలూకుదార్ మృతితో గ్రామగ్రామానికి ఆసు ఉద్యమం వ్యాపించింది. 1983 ఫిబ్రవరి నెలలో పది రోజుల గ్యాప్‌తో రెండు సార్లు ఉద్యమకారులు గ్రామాలపై దాడి చేశారు. విదేశీయులన్న అనుమానం వస్తే చాలు… మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ చంపేశారు. ఫిబ్రవరి ఏడున ఖోరియాబారి ఏరియాలో 500 మంది వరకు బెంగాలీ హిందువుల్ని, ఫిబ్రవరి 18న నాగావ్ జిల్లాలోని 14 గ్రామాలపై విరుచుకుపడి 2,191 మందిని చంపేశారు. వీటినే ఖోరియాబారి ఊచకోత, నెల్లి ఊచకోతగా గుర్తిస్తున్నారు. అస్సాం చరిత్రలోనే ఇవి అతి దారుణ హత్యాకాండలుగా చరిత్రకెక్కాయి. ఉద్యమాల్లో స్టూడెంట్లు 860 మంది వరకు ప్రాణాలు బలి చేసుకున్నారు. మొత్తంగా అరేళ్లపాటు సాగిన గొడవల్లో 3,551 మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. రాజీవ్ గాంధీ తన హయాంలో ఒప్పందం చేసుకోవడంతో… ఆసు విద్యార్థి నాయకులంతా అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)గా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసి, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అస్సాంలో స్థానికుల హక్కులు, ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు, వనరుల వినియోగం వంటి విషయాల్లో ఎక్కడా రాజీపడరని పై రెండు ఊచకోతలు చెబుతున్నాయి. తాజా సవరణ బిల్లువల్ల కటాఫ్ డేట్ 2014 అవుతుందని, ఇది అస్సాం ఒప్పందానికి తూట్లు పొడవడమేనని ఉద్యమకారులు వాదిస్తున్నారు.
మణిపూర్‌కీ ‘ఇన్నర్ లైన్ పర్మిట్’
బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్–1873 కింద జారీ చేసే ఈ డాక్యుమెంట్‌కి సంబంధించిన కండిషన్లు, రెగ్యులేషన్లు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. లాంగ్ టర్మ్ విజిటర్లకు ఇవి కాకుండా వేరే రూల్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఇవేవీ వర్తించవు.
మణిపూర్‌ని ఇండియాలో విలీనం చేయకముందే అక్కడ ఐఎల్పీ మాదిరి వ్యవస్థే అమల్లో ఉండేది. ఆ రూల్‌ని 1951లో అప్పటి చీఫ్ కమిషనర్ హిమ్మత్ సింగ్ ఎత్తేసి, బయటివాళ్లను అడ్డూఅదుపు లేకుండా రానిచ్చారు.
2011 సెన్సస్ ప్రకారం మణిపూర్ జనాభా 27 లక్షలు. అందులో స్థానికులు 17 లక్షల మంది కాగా మిగతా 10 లక్షల మందీ నాన్ లోకల్సేనని ‘ఐఎల్పీపై ఏర్పాటైన జాయింట్ కమిటీ’ ఇన్ఛార్జ్ కన్వీనర్ కె.హెచ్.రతన్ అన్నారు.
మణిపూర్‌కి ఫారిన్ టూరిస్టులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ వంటి పక్క దేశాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరుగుతుండటంతో జనాభాలో మార్పు జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగాలు, వనరులపై స్థానికులకు, ఔట్‌సైడర్లకు మధ్య పోటీ నెలకొంటోంది.
త్రిపురలో నాన్లోకల్స్దే పెత్తనం
త్రిపురలో గడిచిన 20 ఏళ్లుగా నాన్ లోకల్ లీడర్లే ముఖ్యమంత్రులు. మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ (సీపీఎం), ప్రస్తుత సీఎం విప్లవ్ కుమార్ దేవ్ (బీజేపీ) ఇద్దరూ ఈస్ట్ బెంగాల్‌కి చెందిన హిందువులు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ‘ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐఎఫ్పీటీ)’ ఈ ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటోంది. ఆదివాసీ రాష్ట్రంగా పేరున్న త్రిపురలో ఇప్పుడు వాళ్లే మైనారిటీలుగా మారారు. మొత్తం జనాభాలో ఆదివాసీలు 30 శాతం ఉంటే కొన్నేళ్లుగా బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్లే 70 శాతం ఉన్నారు. ఇలా వలసవచ్చిన వాళ్లలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లేనని ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్ఎల్ఎఫ్టీ)’ పేర్కొంది.