
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులను కేంద్రం చర్చలకు పిలవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. వారి సమస్యను కేంద్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా.. సామాజిక ఆర్థిక, రాజకీయ సమస్యగా చూడాలని, ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపాలన్నారు. మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాడాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. కాల్పులు విరమిస్తే తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించినందున.. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించి వారిని చర్చలకు పిలవాలని ప్రధానికి జాజుల విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా తాము ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమేనని.. అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే , ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం మంచి పరిణామన్నారు. ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీ విజ్ఞతతో ఆలోచించి నక్సల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆయన కోరారు, పోలీసులు, మావోయిస్టులు ఒకరికొకరు శత్రువులు కారని.. ఇది అనేక సందర్భాలలో నిరూపితమైందన్నారు. మావోయిస్టుల చేతికి పోలీసులు దొరికినా.. పోలీసుల చేతికి మావోయిస్టులు దొరికినా ఒకరినొకరు చంపుకోలేదని.. ఇలాంటి సందర్భంలోనే మానవత్వం నిలబడతుందని ఆయన అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా చర్చలు ప్రారంభించాలని, దండకారణ్యంతో పాటు కర్రె గుట్టల్లో కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్ ను నిలిపివేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.