రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తనకు చాలా బాధ కలిగించిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ప్రజా తీర్పును తప్పక అంగీకరించాలని అదే ప్రజాస్వామ్యం నిజమైన గొప్పతనం అని తెలిపారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కో–ఇన్ చార్జ్‌గా ఆయన వ్యవహరించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘అస్సాంలో జరిగిన ఉప ఎన్నికల్లో మేం 5 స్థానాలను గెలుచుకున్నాం. అయినప్పటికీ, జార్ఖండ్‌లో పార్టీ ఓటమి నాకు వక్తిగతంగా చాలా బాధను కలిగించింది.
చొరబాట్ల నుంచి రాష్ట్రాన్ని రక్షించి అభివృద్ధికి బాటలు వేయడం, యువత, స్టూడెంట్ల ఆకాంక్షలను నెరవేర్చడం వంటి హామీలతో ఎన్నికల్లో బీజేపీ పోరాడి ఓటమి పాలైంది. జార్ఖండ్ లో మా పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పని చేశారు”అని పేర్కొన్నారు.