
జీన్స్ వేసుకున్నందుకు ఓ యువతిని షాప్‌లో నుంచి గెంటేశారు. ఈ ఘటన అస్సాంలోని బిస్వంత్ జిల్లాలో చోటు చేసుకుంది. బిస్వంత్ చరియాలోని ఓ మొబైల్ స్టోర్‌లో ఇయర్ ఫోన్స్ కొనడానికి వెళ్లిన ఆ అమ్మాయిని షాప్ ఓనర్ నురుల్ అమిన్ బయటకు వెళ్లమన్నాడు. బుర్ఖా వేసుకోకుండా షాపులోకి వచ్చినందుకు అమ్మాయికి ఇయర్ ఫోన్స్ అమ్మేందుకు నిరాకరించిన నురుల్ అమిన్.. జీన్స్ ఎందుకు వేసుకున్నావంటూ అవమానించి బయటకు నెట్టేశాడు. ఈ ఘటనపై యువతి స్పందిస్తూ.. షాప్ ఓనర్ తనను అవమానించాడని, తనను గెంటేశాడని వాపోయింది. ‘ఆ వ్యక్తి ఇంట్లోనే షాప్‌ను నడిపిస్తున్నాడు. నేను జీన్స్ వేసుకుంటే ఆయన కోడలిపై ప్రభావం పడుతుందని నన్ను నెట్టివేశారు. ఆయన నన్ను గెంటేస్తున్నప్పుడు వారి కుటుంబీకులు వద్దని వారించలేదు’ అని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు వచ్చిన తన తండ్రి మీద షాప్ ఓనర్ కుటుంబీకులు దాడి చేశారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.