అసెంబ్లీ ఎన్నికలకు మందు అసాంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. లఖీంపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా సోమవారం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన భార్య రాణీ నారాకు లఖింపూర్ ఎంపీ సీటు వస్తుందని భరత్ నారా ఆశించారు. అయితే, కాంగ్రెస్.. ఆ స్థానానికి ఉదయ్ శంకర్ హజారికాను అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా తన భార్యను ప్రకటించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ భరత్ నారా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు.
అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి ఆదివారమే నారా రాజీనామా చేశారు. తాను మీడియా డిపార్ట్‌మెంట్, అస్సాం పీసీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరాకు నారా తన రాజీనామా లేఖ పంపించారు.
కాగా, గతంలో రాణీ నారా కేంద్ర మంత్రిగా పనిచేశారు. లఖింపూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా కూగా గెలిచారు. రాణీ నారా, ఉదయ్ శంకర్ హజారికా ఇద్దరూ కొన్ని నెలల క్రితమే అధికార బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి లఖింపూర్ నియోజకవర్గం సీటు కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఆ సీటు హజారికాకు దక్కింది.
అస్సాంలో ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్ మార్చి 12న ప్రకటించింది. అస్సాంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, దాని మిత్రపక్షమైన అస్సాం జాతీయ పరిషత్ (AJP) ఒక స్థానం నుంచి పోటీ చేయనుంది.