బోయిన్​పల్లిలో దారుణ హత్య

బోయిన్​పల్లిలో దారుణ హత్య
  • ఇంటి ముందు కూర్చున్న యువకుడిని నరికి చంపిన దుండగులు
  • అమ్మాయి తల్లిదండ్రులే హత్య చేయించి ఉంటారని అనుమానాలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్  బోయిన్ పల్లి లో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. రెండు బైక్ లపై వచ్చిన ఐదుగురు అతడిపై కత్తులతో దాడిచేసి మర్డర్  చేశారు. సమీర్  (20) అనే వ్యక్తి సికింద్రాబాద్  ఓల్డ్ బోయిన్ పల్లిలోని హర్షవర్ధన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా వెల్డర్ గా పనిచేస్తున్నాడు.

బోయిన్ పల్లికే చెందిన ఓ యువతిని సమీర్  ప్రేమించి నిరుడు పెండ్లి చేసుకున్నాడు. ఈ పెండ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేదు. పెండ్లయిన కొంతకాలానికే దంపతులిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను  పుట్టింటికి తీసుకువెళ్లారు. తన కూతురిని పెండ్లి చేసుకుని అతను ఇబ్బందులకు గురిచేశాడనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులు సమీర్​పై కక్ష పెంచుకున్నారు. గత కొద్ది నెలలుగా ఆమె తన తల్లిదండ్రులతోనే ఉంటోంది. సమీర్  పలుమార్లు తన భార్య ఇంటికి వెళ్లి ఆమెను పంపాలని ఆమె పేరెంట్స్ ను కోరినా వారు వినలేదు. ఈ క్రమంలో సమీర్  శనివారం రాత్రి తన ఇంటి ముందు కూర్చుని ఉండగా 2 బైకులపై వచ్చిన ఐదుగురు.. అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి చంపేశారు.

దాడిని ఓ స్థానిక యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చంపేస్తామని దుండగులు అతడిని బెదిరించారు. హత్య చేసి నిందితులు పారిపోయారు. అయితే, అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్య చేయించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, బోయిన్​పల్లి ఇన్​స్పెక్టర్​ లక్ష్మీనారాయణ రెడ్డి  క్లూస్ టీమ్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమీర్ ను హత్య చేయడానికి నిందితులు బస్తీలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.