రంగారెడ్డి జిల్లాలో 70 ఏండ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం, హత్య.. సీపీ ఆదేశాలతో 70 రోజుల తర్వాత కేసు నమోదు

రంగారెడ్డి జిల్లాలో 70 ఏండ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం, హత్య.. సీపీ ఆదేశాలతో 70 రోజుల తర్వాత కేసు నమోదు
  • ఆపై హత్య చేసిన యువకుడు  70 రోజులైనా కేసు నమోదు చేయని పోలీసులు
  • రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన
  • మర్నాడే తెలిసినా పట్టించుకోని వైనం
  • సీపీ దృష్టికి వెళ్లడంతో సిబ్బందిపై సీరియస్
  • ఎట్టకేలకు కేసు నమోదు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారంలో నడిరోడ్డుపై 70 ఏండ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు రేప్ చేసి హత్య చేస్తే.. 70 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా ఏమీ తెలియదన్నట్టు అంతా గప్ చుప్​అయ్యారు. తీరా విషయం తెలిసిన రాచకొండ సీపీ సుధీర్​బాబు ఈ ఘటనలో సిబ్బందిపై సీరియస్ కావడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్​గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు ఓ వృద్ధురాలు (70) భిక్షాటన చేస్తూ అక్కడే పడుకుంటోంది. గతేడాది డిసెంబర్​9న స్థానికంగా సెంట్రింగ్​పనులు చేసే యువకుడు (30) పని నుంచి ఇంటికి వెళ్తూ.. అంతకుముందే వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ పెనుగులాటలో వృద్ధురాలి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత వృద్ధురాలి మృతిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో యాచారం పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వృద్ధురాలిపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించారు. ఆ పూర్తి వివరాలను యాచారం సీఐ నరసింహారావుకు సైతం వివరించారు.

అయితే, ఈ విషయాన్ని సీఐ నరసింహా లైట్ తీసుకున్నట్లు తెలిసింది. భిక్షాటన చేసే వృద్ధురాలే కదా ఎవరూ అడగరని కేసు కూడా నమోదు చేయలేదు. తీరా 70 రోజుల తర్వాత ఈ విషయం సీపీ సుధీర్​బాబు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్​అయ్యాడు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.