22 నుంచి అసెంబ్లీ..10 రోజుల వరకు సెషన్స్​ నిర్వహించే అవకాశం

22 నుంచి అసెంబ్లీ..10 రోజుల వరకు సెషన్స్​ నిర్వహించే అవకాశం

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్  అకౌంట్​ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో, రాష్ట్రంలో కూడా ఓటాన్  అకౌంట్ బడ్జెట్  ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్‌‌‌‌లో పూర్తిస్థాయి  బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కల ప్రకారం, రాష్ట్ర సర్కారు‌‌‌‌ కూడా ఫుల్ బడ్జెట్  ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు ప్రారంభించింది. ఈ నెల 22 లేదా 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి కనీసం పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నది.

బడ్జెట్‌‌‌‌ ఆమోదంతో పాటు పలు బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టి వాటికి సభ ఆమోదం తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను కూడా ఈ సమావేశాల్లో సీఎం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రజా సమస్యలు, రైతు రుణమాఫీ, మేడిగడ్డ బ్యారేజీ తదితర అంశాలపై కూడా ఈ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కనీసం పది రోజులు సభ నిర్వహించాలని సర్కారు భావిస్తోంది.

ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు చైర్మన్, స్పీకర్ ఆదేశం

సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎస్‌‌‌‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి, స్పీకర్  గడ్డం ప్రసాద్ ‌‌‌‌ అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వారు ఆదేశించారు. శాసనసభ , శాసన మండలిలో పెండింగ్‌‌‌‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఇప్పుడే సంబంధిత  అధికారులకు ఆదేశాలు జారీచేస్తే సమావేశాలు నిర్వహించే నాటికి పనులన్నీ పూర్తిచేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాల్లో  ప్రొటోకాల్  వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు, సుదూర ప్రాంతాల పర్యటనలకు వెళ్లినప్పుడు  తగిన భద్రత, బందోబస్తు కల్పించాలని శాసన మండలి చైర్మన్, స్పీకర్ పోలీసు ఉన్నతాధికారులకు  సూచించారు.