ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ బందోబస్తుకు పోలీస్‌‌‌‌‌‌‌‌ వ్యూహం

ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ బందోబస్తుకు పోలీస్‌‌‌‌‌‌‌‌ వ్యూహం
  • సెక్యూరిటీకి యాక్షన్ ప్లాన్  రెడీ చేసిన పోలీసులు
  • పల్లెల నుంచి పట్నందాకా పకడ్బందీగా ఏర్పాట్లు
  • మావోయిస్టుల కట్టడి, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా మానిటరింగ్‌‌‌‌‌‌‌‌
  • అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు
  • సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీక్షలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున పోలీసులు అలర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో పాటించాల్సిన వ్యూహాలను సిద్ధం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీజీలు, ఐజీలు, జిల్లాల ఎస్పీలు, సీపీలు, ఇంటలిజెన్స్‌‌‌‌‌‌‌‌ అధికారులతో ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.

2 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మారిన పార్టీల వ్యూహాలపై ఫోకస్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పర్యటనలు, బహిరంగ సభలకు తగిన బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ నుంచి రిజల్ట్ ​దాకా పక్కా ప్లాన్

ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదలయ్యాక తీసుకోవల్సిన భద్రతా చర్యలపై స్టేషన్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌ దగ్గర్నుంచి డీజీ స్థాయి అధికారి వరకు కోడ్‌‌‌‌‌‌‌‌ అమలుపై అవగాహన కలిగిస్తున్నారు. ఇందుకోసం స్థానిక కమిషనరేట్లు,ఎస్పీ ఆఫీసులలో బ్యాచ్‌‌‌‌‌‌‌‌ల వారీగా పోలీస్ సిబ్బందికి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు పాటించాల్సిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు.

అభ్యర్థుల నామినేషన్లు, పార్టీల ప్రచారాలు, పోలింగ్‌‌‌‌‌‌‌‌, రిజల్ట్‌‌‌‌‌‌‌‌, విజయోత్సవాలు ఇలా ప్రతి దశలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలతో ప్రత్యేక గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు. రౌడీషీటర్లు, ఎన్నికల సమయాల్లో అవాంఛనీయ ఘటనలకు పాల్పడేవారి వివరాలు సేకరిస్తున్నారు.

కేంద్ర బలగాలు, సరిహద్దు పోలీసులతో నిఘా

 రాష్ట్ర పోలీసులతో పాటు అవసరమైన కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా పోలీస్ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజులకింద మహారాష్ట్ర పోలీస్ అధికారులతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో సమావేశం నిర్వహించారు.

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ సహా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికలకు ముందు, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 6 రాష్ట్రాల పోలీస్ అధికారులు చర్చించారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఉంచడంతో పాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో సోషల్‌‌‌‌‌‌‌‌మీడియాపై  ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.