జార్ఖండ్‌లో గెలిచేదెవరో.. నేడే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్​

 జార్ఖండ్‌లో గెలిచేదెవరో.. నేడే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్​

రాంచీ: జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితం నేడే తేలనున్నది. జేఎఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం దక్కించుకుంటుందా? లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఈసారి కొలువుదీరుతుందా? అనే ఉత్కంఠ వీడనున్నది.  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.  ఉదయం 8 గంటలకు పోస్టల్​ బ్యాలెట్​ను లెక్కిస్తారు. అనంతరం 9 గంటలనుంచి ఒక్కో ఫలితం వెలువడనున్నది. కాగా, అన్ని కౌంటింగ్​ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను నిష్పక్షపాతంగా లెక్కించేందుకు ప్రతి టేబుల్​కు ఏఆర్​ఓ నేతృత్వం వహిస్తారని చెప్పారు. కౌంటింగ్​లో పారదర్శకత పాటిస్తున్నామని, నిఘా మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 

రికార్డు స్థాయిలో పోలింగ్​

జార్ఖండ్​లో నవంబర్​13, 20న రెండు దశల్లో పోలింగ్​జరిగింది. మొదటి దశలో 43 నియోజకవర్గాల్లో 81 సీట్లకు, రెండో దశలో 38 సీట్లకు ఓటింగ్​ జరిగింది. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అత్యధిక పోలింగ్​ (67.74%) నమోదైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. 

అధికారం నిలబెట్టుకోవాలని జేఎంఎం, ఈసారి ఎలాగైనా జార్ఖండ్​లో పాగా వెయ్యాలని బీజేపీ చూస్తున్నది. ఎన్డీయేనే ఈసారి అధికారం దక్కించుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్​ పోల్స్ అంచనావేయగా.. ఇండియా కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని కొన్ని ఎగ్జిట్​పోల్స్​స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కాగా, 2019 ఎన్నికల్లో జేఎంఎంకు 30 సీట్లురాగా, బీజేపీ 25 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్, ఆర్జేడీతో జతకట్టిన జేఎఎం అధికారం చేపట్టింది.