
- మహబూబాబాద్ జిల్లాలోని 2 సెగ్మెంట్లకు 9 అప్లికేషన్లు
- మానుకోటకు ఆరుగురు, డోర్నకల్ కోసం ముగ్గురు పోటీ
- టికెట్ దక్కించుకునేందుకు హైదరాబాద్‌లోనే మకాం
మహబూబాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్ క్యాండిడేట్ల ఎంపిక కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది అప్లికేషన్లు అందజేశారు. ఇందులో మానుకోట కోసం ఆరుగురు పోటీ పడుతుండగా, డోర్నకల్ టికెట్ కోసం ముగ్గురు అప్లై చేసుకున్నారు. ఇన్ని రోజులు తండాల వెంట తిరిగిన లీడర్లు ప్రస్తుతం వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మానుకోటలో ఎవరికి వారే ప్రచారం
మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్మురళీనాయక్, నునావత్ రాధ, నునావత్ రమేశ్ దస్రు నాయక్ అప్లై చేసుకున్నారు. ఇందులో ఏఐసీసీ అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉండడంతో టికెట్ తనకే ఖాయం అవుతుందని బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక స్థానిక నినాదమే ఆయుధంగా డాక్టర్ మురళీనాయక్ తండాల వెంట తిరుగుతున్నారు. టికెట్ తనకే వస్తుందని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇక గతంలో లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసినందున, జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నందున తనకు టికెట్ దక్కుతుందని బెల్లయ్యనాయక్ ఆశగా ఉన్నారు.
డోర్నకల్‌లో టఫ్ ఫైట్
డోర్నకల్ నియోజకవర్గం నుంచి జాటోతు రామచంద్రునాయక్, మాలోతు నెహ్రూ నాయక్, నూనావత్ భూపాల్‌నాయక్ అప్లై చేసుకున్నారు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిన డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్ ఈ సారి టికెట్, గెలుపు రెండూ తనవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పారిశ్రామిక వేత్త మాలోతు నెహ్రూనాయక్ నాలుగేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కిసాన్ పరివార్ సంస్థ నిర్వాహకుడు భూపాల్ నాయక్ హైకమాండ్ వద్ద ఉన్న పరిచయాలే తనకు కలిసివస్తాయని ధీమాగా ఉన్నారు.
వర్గపోరుతో నష్టపోతున్న కాంగ్రెస్
మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ వర్గపోరు మూలంగా ప్రతి సారీ నష్టపోతోంది. టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న లీడర్లు క్యాండిడేట్లకు సహకరించడం లేదు. దీన్ని ఇతర పార్టీల లీడర్లు తమకు అనుకూలంగా మలుచుకొని విజయం సాధిస్తున్నారు. ఈ సారైనా లీడర్లంతా కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ విజయం ఖాయం అవుతుందని కేడర్ అభిప్రాయపడుతున్నారు.