బోగస్​ ఓట్ల లొల్లి .. ఎలక్షన్​లో గట్టెక్కడానికి లీడర్ల ప్లాన్

  • బూత్​కు 50 మందిని చేర్చేలా ప్రయత్నాలు
  • విషయం బయటపడకుండా ఆన్​లైన్​లోనే అప్లికేషన్లు
  • అధికార పార్టీ పనేనంటూ ప్రతిపక్షాల విమర్శలు

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో బోగస్​ఓటర్ల నమోదు లొల్లి కాక రేపుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో అనుమానాస్పద విషయాలు బయటకు రాగా, మిగతా సెగ్మెంట్లలోనూ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ పై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సరిహద్దున ఉన్న మహారాష్ట్రతో జిల్లాలోని అనేక కుటుంబాలకు బంధుత్వం, వ్యాపార సంబంధాలు ఉంటాయి. మంజీరా నదిలో ఇసుక క్వారీలు నడిచినప్పుడు జిల్లా లీడర్లకు పార్ట్​నర్​షిప్​ ఉంటుంది. క్వారీ అవసరాలకు వేల సంఖ్యలో పక్క రాష్ట్ర కూలీలతో పనిచేయించుకొని డబ్బులు చెల్లించేవారు.

ఆ సమయంలో సేకరించిన ఫోన్​నెంబర్ల ద్వారా ఇప్పుడు వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఒకరి నుంచి మరొకరిని చైన్​పద్ధతిలో రీచ్​అవుతున్నారు. ధర్మాబాద్, బిలోలి, నర్సీ, నాయేగావ్, దెగ్లూర్​ మొదలుకొని నాందేడ్​ దాకా జిల్లా మొత్తం ఎమ్మెల్యేలకు చెందిన టీంలు పనిచేస్తున్నాయి. అక్కడివారికి గవర్నమెంట్​పథకాలు, నగదు ఇస్తామని ఆశచూపి ఓటరుగా నమోదు చేయిస్తున్నారు.

ఇంటి బై నంబర్లతో అప్లికేషన్లు..

ఇటీవల ఎన్నికల ఆఫీసర్లు ఓటర్ డ్రాఫ్ట్ ​లిస్ట్​ ప్రకటించారు. అందులో మార్పు చేర్పుల కోసం గత నెల 26, 27 తేదీల్లో స్పెషల్​ క్యాంప్​లు నిర్వహించారు. ప్రతీ పోలింగ్​ బూత్​వద్ద బీఎల్​వోలు అర్జీలు స్వీకరించగా, జిల్లా మొత్తం మీద 5,600 దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించాల్సి ఉంది. మరో పక్క సెప్టెంబర్​19 వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నడుస్తోంది. అక్టోబర్​4న ఫైనల్​లిస్టును ప్రకటించనున్నారు. ఆ తర్వాత మార్పులకు ఛాన్స్​ ఉండదు.

ఎన్నికలకు ఆ లిస్టే ప్రామాణికంగా కానుంది. ఇలా చివరి స్టేజ్​లో ఓటర్​ లిస్టును వీలైనంత మేర తమకు అనుకూలంగా మార్చడానికి లీడర్లు యత్నిస్తున్నారు. స్థానికులు కానివారి పేర్లతో ఆన్​లైన్​లోనే దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పుడున్న ఇంటి నంబర్లకు బై నంబర్లు తగిలించి అప్లికేషన్లు పెడుతున్నారు. ఇంటి యజమానులకు తెలియకుండా అదే ఇంట్లోని ఓటర్లకు అదనంగా కొత్త పేర్లు చేరుస్తున్నారు.

ఫీల్డ్​ విజిట్ ​మస్ట్​..

ఓటర్​ లిస్టుపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లొసగులు లేని ఫైనల్​లిస్ట్​ను తయారు చేయడం ఆఫీసర్లకు కత్తి మీద సాములా మారింది. ఎలక్షన్​ కమిషన్ ​గైడ్​లైన్స్ ఒక ఇంటి నంబర్​పై ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉంటే క్రాస్​చెక్ ​చేసి, కన్ఫర్మ్ ​చేసుకోవాలి. ఇంటి యాజమాని ధ్రువీకరణ తీసుకొని, కొత్త ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. 

ఆన్​లైన్​పైనే అర్జీ..

ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి ఆఫ్​లైన్​లో వందల సంఖ్యలో అర్జీలిస్తే, బయటపడతామని ఉద్దేశంతో ఆన్​లైన్ రూట్​ఎంచుకుంటున్నారు. బోధన్​లో రెండు, నిజామాబాద్​లో రెండు మీ–సేవా సెంటర్లు ఇందు కోసమే ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో కేవలం బోధన్​లోనే  6,225 కొత్తగా ఓటు హక్కు కోసం ఆన్​లైన్​ దరఖాస్తులు పెట్టారు. ఆఫ్​లైన్​లో ఒక్క దరఖాస్తు రాకపోవడం స్థానికంగా దుమారం రేపుతోంది. అయిదు పోలింగ్ బూత్​ల పరిధిలో 500 వందలకు మించి ఆర్జీలు రావడం అనుమానాస్పదంగా మారింది.

నాలుగు రోజుల కింద నిజామాబాద్​ సిటీలోని ఒక పోలింగ్​బూత్​లో సర్వే ఏజెన్సీ పేరుతో కొందరు అనుమానితులు హల్​చల్​చేశారు. ఓటర్​ లిస్టులో తమవద్ద ఉన్న ఫొటోలు అంటించే ప్రయత్నం చేశారు. జిల్లావ్యాప్తంగా 1549 పోలింగ్​బూత్​లు ఉండగా, బూత్​కు కనీసం 50 చొప్పున స్థానికేతర ఓట్లను చేర్చేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.