కుల సంఘాలపై ఫోకస్.. ఓట్ల కోసం ఫండ్స్​తో గాలం

  • కమ్యూనిటీ హాల్స్​, గుళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపులు
  • నియోజకవర్గాలపై పట్టుకోసం పాకులాడుతున్న నేతలు

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు ప్రధాన పార్టీల నుంచి పోటీకి రెడీ అవుతున్న  ఆశవహులందరు కుల సంఘాల ఓట్లనే టార్గెట్​ చేస్తున్నారు.  జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో  కుల సంఘాల పెద్దలు అడిగిందే తడవుగా ఫండ్స్​  రిలీజ్​ చేస్తున్నరు.  ముఖ్యంగా అధికార బీఆర్ఎస్​ స్పెషల్​ ఫండ్స్,  ఎమ్మెల్యేలకు కేటాయించే సీడీసీ ఫండ్స్​ నుంచి  కమ్యూనిటీ హాల్స్,  ప్రార్థన మందిరాల నిర్మాణానికి ఫండ్స్​ శాంక్షన్​ చేస్తోంది. 

ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్​ నుంచి  పోటీకి రెడీ అయిన వాళ్లు  కూడా  కుల సంఘాల కోసం చందాలు ఇస్తున్నారు. దీనివల్ల వారి సామాజిక ఓట్లని ప్రభావితం చేయొచ్చని పలు పార్టీల లీడర్లు భావిస్తున్నారు.  ప్రధానంగా కమ్యానిటీ హాల్స్​,  ఫంక్షన్​ హాల్స్​, కుల దేవతలకు ఆలయాల నిర్మాణం, చర్చిలు, మసీదుల కోసం ఫండ్స్​ కేటాయిస్తున్నారు.  

అదునుగా భావిస్తున్న జనాలు 

పలు రాజకీయ పార్టీల నేతలు ఓట్ల కోసం ఫండ్స్​ కేటాయిస్తుంటే జనాలు మాత్రం ఇదే అదనుగా భావించి వారి అవసరాలని తీర్చుకుంటున్నారు. ఇలాగైనా ఎంతో కొంత డెవలప్​ జరుగుతుందని ఆశిస్తున్నారు. అందుకే ఓట్ల కోసం వచ్చిన నాయకులందరిని పలు నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కుల సంఘాల ద్వారా ఎన్నో కొన్ని ఓట్లని ప్రభావితం చేయొచ్చనే ఆలోచనతో నేతలు కూడా  వారి కోరికల్ని అంగీకరిస్తున్నారు. 

ALSO READ: మావోయిస్టులపై పోలీసుల స్పెషల్​ ఫోకస్

కామారెడ్డి నియోజక వర్గంలో..​​

కామారెడ్డి నియోజక వర్గంలో  వివిధ కుల సంఘాల  కమ్యానిటీ హాల్స్,  ప్రార్థన మందిరాల కోసం ఇటీవల ప్రభుత్వం భారీగా  ఫండ్స్​ శాంక్షన్​ చేసింది.  స్పెషల్​ ఫండ్స్ దాదాపు​ రూ.15 కోట్లు శాంక్షన్​ అయ్యాయి.  ఇందులో  రూ. 12 కోట్లకు పైగా  బిల్డింగ్​ల నిర్మాణం,  కాంపౌండ్​వాల్స్,  టెంపుల్స్,  మసీదులు, చర్చిల నిర్మాణానికి  ఇచ్చారు.  ఒక్కో  సంఘానికి  రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కేటాయించారు.  మిగతావి  జీపీ బిల్డింగ్​లు,   Aస్కూల్స్​ రిపేర్​కు  ఇచ్చారు. 

ఇతర పార్టీల నేతలు కూడా..

బీజేపీ నేత కాటిపల్లి వెంకటమణరెడ్డి  కూడా  పలు సంఘాల  బిల్డింగ్ నిర్మాణం చేయించారు.  కాంగ్రెస్​ పార్టీ నేత షబ్బీర్​అలీ కూడా కుల సంఘాలకు, టెంపుల్స్​కు చందాలు ఇస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు చందాలు ఇస్తున్న తరుణంలో  బీఆర్​ఎస్​ మరింత అలర్ట్​ అయినట్లు తెలుస్తోంది. బాన్స్​వాడ నియోజక వర్గంలో  కూడా స్పెషల్​ ఫండ్స్, ఎమ్మెల్యే కోటా ఫండ్స్​తో కుల సంఘాలు,  పంక్షన్​ హాల్స్​ నిర్మాణం  చేశారు.  ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజక వర్గాల్లో  కూడా ఎమ్మెల్యే  కోటా  ఫండ్స్​ కమ్యూనిటీ హాల్స్​కు కేటాయించారు.